వసూళ్ల లో ఆమె స్టైలే వేరు- ట్రాఫిక్ పోలీసుల తీరు!
Publish Date:Mar 24, 2025

Advertisement
రోడ్డుమీద ట్రాఫిక్ పోలీసు ఎవరినైనా ఆపితే ఏం చేస్తాడు? హెల్మెట్, ఆర్సీ బుక్, లైసెన్సు, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి తనిఖీ చేసి ఏది తేడాగా కనిపించినా సరే వేల రూపాయల్లో చలానా కట్టవలసిందే అంటూ పుస్తకం పెన్ను తీస్తాడు. దానికి ఎవరైనా ఎలా స్పందిస్తారు? సార్ సార్ నా దగ్గర అంత డబ్బులు లేవు సార్.. వదిలేయండి సార్.. ప్లీజ్.. వందో అయిదొందలో ఇస్తాను అంటూ బ్రతిమాలుతారు! కాసేపు బ్రతిమాలిన తర్వాత వారిచ్చే సొమ్ము పుచ్చుకొని చలానా పుస్తకాన్ని తిరిగి సంచిలో పెట్టుకొని.. మరొకరి కోసం నిరీక్షిస్తాడు ట్రాఫిక్ పోలీసు!
తన నియోజకవర్గం పరిధిలో అడ్డగోలుగా అరాచకాలను సాగించడంలో మాజీ మంత్రి విడదల రజని అనుసరించిన వ్యూహం ఇంతకంటే భిన్నంగా ఎంత మాత్రమూ లేదు! అచ్చంగా ట్రాఫిక్ పోలీసుల లాగానే ఆమె భారీ మొత్తాలు జరిమానాలుగా చూపించి బెదిరిస్తూ, చిన్న మొత్తాలను గుట్టు చప్పుడు కాకుండా దండుకున్నారనేది ఆరోపణ. చిన్న మొత్తాలు అనగా ఏమిటనుకుంటున్నారో అథమపక్షం రెండు కోట్ల రూపాయలన్న మాట.
విడదల రజని చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన ఏడాదిలో లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆ క్రషర్ యజమానులే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు తరువాత.. విడదల రజనికి రెండుకోట్లు, ఆమె మరిది గోపి, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా లకు చెరి పది లక్షల వంతున ముడుపులు సమర్పించినట్టుగా కేసు నమోదు అయింది. నమోదైన కేసు, ఆరోపణల ప్రకారం.. ఈ దందా సాగిన తీరు మాత్రం.. అచ్చంగా ట్రాఫిక్ పోలీసు వ్యవహారం లాగానే ఉన్నదని ప్రజలు నవ్వుకుంటున్నారు. అదెలాగో తెలుసుకోండి..
స్టెప్ 1 : రజని తరఫున ఆమె పీఏ రామకృష్ణ క్రషర్ యజమానుల వద్దకు వెళ్లి.. మేడం వాళ్లను కలవాలనుకుంటున్నట్టుగా చెప్పారు.
స్టెప్ 2 : వారు వెళ్లి కలిసినప్పుడు.. తన నియోజకవర్గంలో వ్యాపారం చేసుకోవాలంటే.. 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని, మిగిలిన సంగతులు పీఏతో మాట్లాడుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.
స్టెప్ 3 : వారం రోజులు కూడా గడవక ముందే అధికారి పల్లె జాషువా.. పెద్దఎత్తున సిబ్బంది మందీ మార్బలంతో క్రషర్ కు తనిఖీలకు వచ్చారు. క్షుణ్నంగా తనిఖీలు జరిపి వెళ్లిపోయారు. నెల తర్వాత ఫోను చేసి.. నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకు 50 కోట్ల రూపాయల జరిమానా విధిస్తామని.. అలా కాకుండా ఉండాలంటే.. వెళ్లి రజని మేడం తో వ్యవహారం సెటిల్ చేసుకోవాలని బెదిరించారు.
స్టెప్ 4 : క్రషర్ యజమానులు మళ్లీ విడదల రజని వద్దకు వెళ్లి.. అయిదు కోట్ల రూపాయలు ఇచ్చుకోలేం అని.. బతిమాలి రెండుకోట్లకు బేరం కుదుర్చుకున్నారు.
స్టెప్ 5 : రజని సూచన మేరకు పురుషోత్తమపట్నంలోని ఆమె మరిది గోపికి వద్దకు రెండు కోట్లరూపాయలు అందజేశారు. అలాగే ఆ గోపికి పది లక్షలు, అధికారి పల్లెజాషువాకు కూడా పది లక్షలు ముట్టజెప్పారు.
..చూశారుగా.. జరిమానా వేస్తే వేలల్లో పడిపోతుందని బెదిరించి వందల రూపాయల ముడుపులు స్వీకరించే ట్రాఫిక్ పోలీసు వ్యవహారంలాగానే.. యాభై కోట్ల జరిమానా పడుతుందని బెదిరించి.. రెండు కోట్లు ముడుపుల కింద స్వీకరించడం.. విడదల రజని స్టయిల్ ఆఫ్ రాజకీయం అని ప్రజలు నవ్వుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/rajani-collection-like-traffic-police-39-194927.html












