సచివాలయంలో రీల్ చేసిన సూడో పోలీస్ అరెస్ట్
Publish Date:Apr 29, 2026
Advertisement
హైదరాబాద్‌లో పోలీస్ యూనిఫామ్‌లో రీల్స్ చేస్తూ హల్చల్ సృష్టించిన సూడో పోలీసును సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీస్ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్న రవి పలుమార్లు పోలీస్ ఉద్యోగానికి ప్రయత్నించిన ప్పటికీ ఎంపిక కాలేకపోయాడు. అయితే పోలీస్ అవ్వాలనే కోరిక మాత్రం ఆశగానే మిగిలిపోయింది. దీంతో పోలీస్ యూనిఫామ్ ధరించి ఫోటోలు, వీడి యోలు తీసుకొని తెగ ఆనందపడిపోయేవాడు. ఇదే అతనికి అలవాటుగా మారింది. ఇటీవల కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన రవి, పోలీస్ యూనిఫామ్‌లో రాష్ట్ర సచివాలయానికి వెళ్లాడు. గేటు వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని బతిమిలాడి ఫోటోలు దిగుతానని చెప్పి కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వెళ్లి ఫోటోలు దిగాడు. అనంతరం అదే ప్రదేశంలో రీల్స్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్ మీడియా ఆధారంగా విచారణ ప్రారంభించిన సైఫాబాద్ పోలీసులు, రవి అలియాస్ నిఖిల్ యాదవ్ అనే పేరుతో పోలీస్ యూనిఫామ్‌లో రీల్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో అతను సచివాలయంలో మాత్రమే కాకుండా ఉప్పల్ స్టేడియం తదితర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా రీల్స్ చేసినట్లు బయటపడింది. దీంతో అతను సూడో పోలీస్‌గా వ్యవహరిస్తున్నాడని నిర్ధారించిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టి చివరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రవి పై చీటింగ్ కేసుతో పాటు ఐటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/pseudo-police-arrest-36-218566.html





