వారిని ముహూర్తం చూసుకోమన్న చిరంజీవి !
Publish Date:Jan 8, 2012
Advertisement
హైదరాబాద్: మంత్రవర్గంలో స్థానాలు పొందేందుకు సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మంచి రోజుల్లో ముహూర్తాన్ని ఖరారు చేసుకోవాలని తన వర్గం నేతలు గంటా శ్రీనివాస రావు, శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్యలకు తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి సూచించినట్లుగా సమాచారం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌కు చిరంజీవి శుక్రవారం అల్పాహార విందు ఇచ్చిన విషయం విదితమే. ఈ విందులో కేబినెట్ విస్తరణపై చర్చ జరిగిందనే వార్తలు వచ్చాయి. త్వరలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరగనున్నందున ఆ రోజు మంత్రి వర్గ విస్తరణ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఆజాద్‌తో చిరంజీవి అన్నారని సమాచారం. అయితే అప్పటి వరకూ ఆగకుండా మంచి రోజులు ఉంటే ముహూర్తం ఖరారు చేసుకుంటే బాగుంటుందని చిరంజీవితో ఆజాద్ అన్నారట. ఈ నెలలో సంక్రాంతి అయిపోయాక పదిహేడు లేదా ఆ తర్వాత తేదీల్లో అనువైన ముహూర్తాన్ని సిద్ధం చేసుకోవాలని వారికి ఆజాద్ సూచించారని సమాచారం. ఈ నెల 19న ఏకాదశి ఉన్నందున కేబినెట్ విస్తరణ అదే రోజు జరిగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేరాలనే చిరంజీవి వర్గం ఆశ ఇన్నాళ్ల తర్వాత తీరుతుంది. త్వరలో చిరంజీవికి కూడా కేంద్రంలో పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి.
http://www.teluguone.com/news/content/pongal-festival-24-10742.html





