చిరు రాక: బొత్స సిఎంకు పాలడుగు సూచన
Publish Date:Jan 8, 2012
Advertisement
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కాంగ్రెసు పార్టీలోకి రావడం పార్టీకి ప్రయోజనమేనని ఆయన కాంగ్రెసులోకి రావడం ఎంత ప్రయోజనమో, కార్యకర్తలకు గుర్తింపు, పార్టీ బలోపేతం చేసుకోవడం అంతకంటే ఎక్కువ అవసరమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావు సూచించారు. చిరంజీవి మోజులో పడి ఇప్పటి వరకూ పార్టీ జెండాలను మోస్తున్న కార్యకర్తలను విస్మరించడం సరికాదని ఆయన అన్నారు. పార్టీ, మంత్రి, నామినేటెడ్ పోస్టులలో కాంగ్రెసు వారికి ప్రధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.కాగా ఇటీవల ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుల మంత్రి పదవులపై విస్తృతంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో తమకు మూడు పదవులు కావాలని చిరంజీవి కోరుతుండగా, అధిష్టానం మాత్రం రెండింటికే పచ్చజెండా ఊపింది. నామినేటెడ్ పోస్టుల్లోనూ చిరు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు కాంగ్రెసు నేతలతో పాటు పిఆర్పీ కేడర్ కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఆర్పీతో పాటు కాంగ్రెసు కార్యకర్తలను మరువవద్దని పాలడుగు సూచించారు.
http://www.teluguone.com/news/content/chiranjeevi-24-10741.html





