భోగాపురం ఎయిర్ పోర్టుపై పొలిటికల్ వార్
Publish Date:Jan 4, 2026
Advertisement
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఎయిర్ పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది. జూన్ నుంచి ఎయిర్ పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమవుతోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి టెస్ట్ ట్రయల్ చేయడానికి భోగాపురం రన్ వే పై తొలి విమానం ల్యాండ్ అయింది. ఈ క్రమంలో భోగాపురంపై అటు రాజకీయంగానూ కాక రేగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపై క్రెడిట్ తమదంటే తమదేనంటూ అటు వైసీపీ, ఇటు టీడీపీ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏ అనుమతులూ లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ వైఎస్ జగన్ అన్ని అనుమతులు వచ్చాకే ఆ ఎయిర్‌పోర్ట్ పనులకు శంకుస్థాపన చేసారని వాదిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం నాటి ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారని ఆ పార్టీ చెబుతోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారని వదిస్తోంది.పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ ప్రకటించారని, డి.పట్టా భూములకూ జిరాయితీ భూమితో సమానంగా పరిహారాన్ని మంజూరు చేశారని వైసీపీ చెబుతోంది. దీంతో రైతులు చాలామంది పిటిషన్లను ఉపసంహరించుకున్నారని, మిగతావాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించిందని వైసీపీ చెప్పుకుంటోంది.దానికి టీడీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ చంద్రబాబు దూర దృష్టికి నిదర్శనం అని, వైసీపీ అధికారం లోకి రాక ముందే ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన జరిగిందని వైసీపీని విమర్శిస్తుంది. అలాగే జగన్ భోగాపురం ఎయిర్ పోర్టును వ్యతిరేకించారని దెప్పి పొడుస్తుంది. దానికి తగ్గట్లే సోషల్ మీడియాలో భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పుడు జగన్ మాట్లాడిన మాటలు ట్రోల్ అవుతున్నాయి. అప్పట్లో జగన్ దీనిపై మాట్లాడుతూ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్టు ఎందుకని విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఈ క్రెడిట్ వార్లో వైసీపీ తీరు చర్చల్లో నలుగుతోంది. మరోవైపు భోగాపురం పోయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్‌పై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్‌కావడం ఏపీ అభివృద్ధికి ఒక మైలురాయి అని తెలిపారు. #VisonVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందని తెలిపారు. తమ పాలనలో వేగవంతమైన అనుమతులతో ఇది సాధ్యమైందని చెప్పారు. భూసేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేయడంతో బలమైన పునాది వేశామన్నారు.
http://www.teluguone.com/news/content/bhogapuram-airport-36-212001.html





