సాయంత్రానికల్లా సాధారణ స్థితి.. పెట్రో కొరతపై సీఎం టెలీకాన్ఫరెన్స్
Publish Date:Apr 27, 2026
Advertisement
ఏపీలో పెట్రో కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్గా దృష్టిపెట్టారు. ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు సంబంధిత అధికారులతో సోమవారం ( ఏప్రిల్ 27) సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు. సోమవారం (ఏప్రిల్ 27) సాయంత్రానికి మెజార్టీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని ముఖ్యమంత్రికి అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు వివరించారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో సాధారణ పరిస్థితిని తీసుకువచ్చేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి వెళ్లిన ఆయిల్ ట్యాంకర్లు సాయంత్రానికి రిటైల్ బంకులకు చేరుకుంటాయని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. స్వయంగా కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయిల్ సరఫరా జరిగేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సూచించిన చంద్రబాబు.. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి ప్రతీ మూడు గంటలకు ఒకసారి నివేదిక ఆదేశించారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు స్పందించాలనీ.. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎలాంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెట్, కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆయిల్ కంపెనీలు నిరంతరం పని చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
http://www.teluguone.com/news/content/normalcy-by-evening-36-218391.html





