న్యూ ఇయర్ గిఫ్ట్..కరెంట్ చార్జీల మోత
Publish Date:Dec 25, 2011
Advertisement
హైదరాబాద్: వినియోగదారులకు నూతన సంవత్సర కానుకగా 'షాకులు' ఇచ్చేందుకు సర్కారు సిద్ధమవుతోంది. విద్యుత్ చార్జీలను భారీగా పెంచే కసరత్తు పూర్తి చేసింది. కరెంటు చార్జీల పెంపుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. చార్జీలు పెంచుకునేందుకు ఆయన పచ్చ జెండా ఊపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే... పేదలకు మాత్రం ఈ బాదుడు నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం... 50 యూనిట్లలోపు వినియోగంపై ఎలాంటి అదనపు భారం ఉండదు. 51 నుంచి 300 యూనిట్ల మధ్య వినియోగించే వారిపై చార్జీల మోత మోగనుంది. ఈ స్లాబ్‌కు ఒక్కో యూనిట్‌పై 25 పైసల నుంచి 55 పైసల వరకు పెంచే అవకాశముంది. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతికి చెందిన వారంతా ఈ స్లాబ్ కిందికే వస్తారు.
పెంపు నుంచి కుటీర పరిశ్రమలు, చిన్న తరహా సంస్థలకు మాత్రం వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. అయితే... హెచ్‌టీ విద్యుత్తు వినియోగించే పరిశ్రమలతోపాటు వాణిజ్య సంస్థల (కమర్షియల్) కరెంటు చార్జీలను కూడా పెంచనున్నారు. కరెంటు చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కమ్‌లు సోమవారం విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈఆర్సీ)కి సమర్పించనున్నాయి. ఈఆర్సీ ఆమోదం పొందడం లాంఛన ప్రాయమే. అదే జరిగితే... పెరిగే చార్జీలు 2012 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి. విద్యుత్తు సరఫరా - కొనుగోలు మధ్య రూ.12,000 కోట్ల వ్యత్యాసం ఉంది. ఇందులో వ్యవసాయంతోపాటు ఇతర రంగాల సబ్సిడీల కింద సర్కారు రూ.6 వేల కోట్లు సమకూర్చనుంది. అంటే... మిగిలిన ఆరు వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి పిండేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గ్యాస్, బొగ్గు వంటి ఇంధనాలపై వ్యయం పెరగడం... జల విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా క్షీణించడమే చార్జీల పెంపునకు కారణమని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/newyear-24-10263.html





