కిరణ్ తో కావూరి..చిరుతో బొత్స
Publish Date:Dec 25, 2011
Advertisement
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు ఏర్పాటు చేసిన సమావేశానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హాజరైతే.. కాంగ్రెస్ ముఖ్యనేత చిరంజీవితో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. కాకతాళీయమే అయినప్పటికీ ప్రభత్వానికి కాంగ్రెస్ పార్టీకి మధ్య సమన్వయం కోసం అధిష్ఠానం ఏర్పాటు చేసిన కోర్‌కమిటీలో సభ్యులుగా ఉన్న కావూరితో సీఎం కిరణ్ ఒక వైపు.. చిరంజీవితో బొత్స మరో వైపు భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా ఈ రెండు సమావేశాల్లోనూ రాష్ట్ర కాంగ్రెస్ రథానికి జోడెద్దుల్లాంటి వారైన పీసీసీ సారథి, సీఎం ఇద్దరూ రాజకీయాలపైనే చర్చించడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులైన టిటిడి చైర్మన్, ఎంపి కనుమూరి బాపిరాజు, డిజిపి దినేశ్ రెడ్డి తదితరులతో కావూరి చిన్నపాటి భేటీని ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేశారు. అదే స్కూల్లో చదువుకున్న కావూరి కుమారుడు భాస్కర రావు తన పూర్వ విద్యార్థులతో కలసి నిర్వహించిన ఈ గెట్ టు గెదర్‌లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఈ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన సిఎం కిరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు సన్మానించారు. అనంతరం కావూరి, సిఎం కిరణ్, బాపిరాజు తదితర నేతలు కొద్దిసేపు రాష్ట్ర రాజకీయాలపై చర్చించుకున్నారని సమాచారం. వీరు ఇక్కడ సమావేశమైన సమయంలోనే.. చిరంజీవితో పీసీసీ చీఫ్ బొత్స భేటీ అయ్యారు. చిరు, బొత్సల భేటీలోనూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కేబినేట్లో ప్రజారాజ్యం ఎమ్మెల్యేల చేరిక, రాష్ట్ర రాజకీయాలపై అధిష్ఠానం ఆలోచన తదితర అంశాలన్నీ చర్చకు వచ్చాయని తెలుస్తోంది. ఇరు వర్గాలూ తమ తమ భేటీలను రాజకీయ ప్రాధాన్యం లేనివి గానే కొట్టిపారేస్తున్నాయి. అయితే ఈ రెండు సమావేశల్లోనూ రాజకీయాలపై చర్చ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా.. వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో సోమవారం భేటీ కానున్నారు. అనంతరం శోభానాగిరెడ్డి మినహా విప్‌ను ధిక్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలవనున్నారు. ఈ నెల 29 వరకూ స్పీకర్ తమకు సమయం ఇచ్చిన నేపథ్యంలో.. అప్పటి వరకూ ఆగకుండా తమపై వెంటనే అనర్హత వేటు వేయాలంటూ సభాపతికి వారు లేఖ ఇవ్వనున్నారు.
http://www.teluguone.com/news/content/hyderabad-24-10262.html





