పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్.. తెలుగుదేశంలో కొత్త అధ్యాయం!
Publish Date:Apr 29, 2026
Advertisement
తెలుగుదేశం రాజకీయ ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయం ఆరంభమైంది. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు, అనంతరం నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కొనసాగుతున్నతెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నారా లోకేష్ పగ్గాలు అందుకోవడానికి అధికారికంగా రంగం రెడీ అయ్యింది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్, ఇప్పుడు పార్టీ కార్యనిర్వాహక అద్యక్షుడిగా మరింత ఉన్నత బాధ్యతలను చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం (ఏప్రిల్ 29) అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు లోకేష్ చేత పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నులుమూలల నుంచీ పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలూ తరలి వచ్చారు. పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు నాయుడు సమక్షంలో లోకేష్ ఈ బాధ్యతలను స్వీకరించారు. లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిటీల ఎంపికలో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యానికి పెద్దపీట వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సుదీర్ఘ చరిత్రలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవిని సృష్టించడం ఇదే తొలిసారి. నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి నాయకుడు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు.. అధినేత చంద్రబాబుకుతో పాటు పార్టీ కార్యకలాపాలను పంచుకోవడమే లక్ష్యంగా లోకేష్ కు పదోన్నతి కల్పించారు. గతంలో యువగళం పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన లోకేష్.. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టడం ద్వారా.. పూర్తిస్థాయిలో పార్టీ పగ్గాలను చేతుల్లోకి తీసుకున్నారని చెప్పవచ్చు. కేవలం పార్టీ వ్యవహారాలే కాకుండా, త్వరలో జరగనున్న మహానాడు వేడుకల నిర్వహణ బాధ్యత కూడా ఇప్పుడు లోకేష్ భుజస్కంధాలపైనే ఉంది. పార్టీ శ్రేణుల్లో లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. సోషల్ మీడియా వేదికగా లోకేష్ పట్టాభిషేకం అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ సందడి చేస్తున్నారు. చంద్రబాబు సలహాలు, సూచనలు కొనసాగుతున్నప్పటికీ, రోజువారీ పార్టీ నిర్ణయాల్లో లోకేష్ ముద్ర ఇక ముందు విస్పష్టంగా కనిపిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారంతో పార్టీలో నవశకానికి నాంది పడిందని అంటున్నారు.
అలాగే.. ఈ ఏడాది చివర్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో.. పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు ప్రతి అంశంలోనూ లోకేష్ నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీని సమాయత్తం చేసే బాధ్యత కూడా చంద్రబాబు తన లోకేష్ కే అప్పగించారు. సీనియర్ల అనుభవాన్ని, యువత ఉత్సాహాన్ని సమన్వయం చేస్తూ లోకేష్ పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారనేది చూడాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/new-chapter-in-the-telugu-desam-45-218515.html




