వీధినపడ్డ రాజకీయం..గ్రేటర్ కాంగ్రెస్‌లో సంక్షోభం
Publish Date:Feb 29, 2012
Advertisement
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడుతోంది. సిట్టింగ్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు, రాష్ట్ర మంత్రి ముఖేష్ గౌడ్‌కు మధ్య రాజుకున్న నిప్పు సెగ.. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ (జీహెచ్‌సీ)ను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న జీహెచ్‌సీ రాజకీయాలు ఒక్కసారి వీధినపడ్డాయి. 2014 సాధారణ ఎన్నికల్లో సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ముఖేష్ చెప్పారు. దీనిపై సిట్టింగ్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అగ్గిమీదగుగ్గిలమయ్యారు. తన నియోజకవర్గం జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరిక చేశారు. సికింద్రాబాద్ నీ యబ్బ జాగీరా? అంటూ మంత్రిని నిలదీశారు.
కాగా వచ్చే ఎన్నికల్లో సికిందరాబాద్ ఎంపిగా తాను పోటీ చేస్తానని మంగళవారం ఉదయం ముఖేష్ గౌడ్ చెప్పిన విషయం తెలిసిందే. అంజన్ ముషీరాబాద్ నుండి బరిలోకి దిగుతారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై అంజన్ సాయంత్రం స్పందించారు. సికింద్రాబాద్ ఏమైనా ముఖేష్ సొంతమా.. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపై కన్నెస్తే ఖబర్దార్ అంటూ నిప్పులు చెరిగారు. తాను ఎక్కడి నుండి పోటీ చేయాలో చెప్పడానికి ముఖేష్ ఎవరు అన్నారు. ఆయన ఏమైనా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాదా వాటి ఈజ్ దిస్ నాన్సెన్స్ అని అన్నారు. అంతటితో శాంతించని అంజన్ కుమర్ యాదవ్.. ముఖేష్‌పై పరుష పదజాలం సైతం ఉపయోగించారు. మగాడివైతే వచ్చే ఎన్నికల్లో గోషామహాల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎంఐఎం మద్దతు లేకుండా గెలిచి చూపించాలని బహిరంగ సవాల్ విసిరారు. ఏసీ రూముల్లో కూర్చుని కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం కాదని ఆయన మండిపడ్డారు.
ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే ముఖేష్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విరుచుకు పడ్డారు. సికిందరాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాలకు ఇప్పుడు నోటిఫికేషనో, మధ్యంతరమో రాలేదు కదా అన్నారు. సికిందరాబాద్ నా సీటు అన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన మహా నాయకుడు బండారు దత్తాత్రేయపై పోటీ చేసేందుకు అందరూ వెనుకాడుతున్న సమయంలో తాను ధైర్యంగా బరిలోకి దిగానన్నారు. అప్పుడు రాకుండా ఇప్పుడు మాట్లాడటమేమిటన్నారు. ప్రజలే నా దేవుళ్లని వారే నన్ను రెండుసార్లు గెలిపించారు మళ్లీ గెలిపిస్తారన్నారు. గ్రేటర్లో మరో బిసి ఎదగకుండా ముఖేష్ అడ్డుపడుతున్నారన్నారు.
మరోవైపు.. తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా మంత్రి మఖేష్ గౌడ్ బుధవారం ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. సికింద్రాబాద్ అంజన్ కుమార్ యాదవ్ జాగీరు కాదనీ, అలాగే తన జాగీరు కాదన్నారు. పార్టీ నాయకత్వం ఆదేశిస్తే ఎవరైనా అక్కడ నుంచి పోటీ చేయవచ్చంటూ సెలవిచ్చారు. ముఖ్యంగా.. సికింద్రాబాద్ లోక్‌సభ ఓటర్లు ఒక ఎంపీని పదేళ్ళ కంటే మించి ఆదరించలేదని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో తాను అక్కడ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. పైపెచ్చు.. తన ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానమైన గోషామహాల్‌ను కూడా వదులుకోనని చెప్పారు. ఈ స్థానం నుంచి తన కుమారుడు విక్రమ్ గౌడ్‌ను బరిలోకి దించుతానని రెట్టింపు ధోరణితో ప్రకటించారు.
http://www.teluguone.com/news/content/mukhesh-goud-24-12283.html





