విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. క్షతగాత్రులను పరామర్శించి, భరోసానిచ్చిన మంత్రి నారా లోకేష్
Publish Date:Jun 9, 2026
Advertisement
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం (జూన్ 9)ఉదయం నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యంచెప్పారు. మంత్రి లోకేష్ వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ఉన్నారు. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్-1 విభాగంలో సోమవారం జూన్ 8) సాయంత్రం సంభవించిన ఘోర పేలుడులో తొమ్మండుగురు మరణంచగా, ఆరుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రి నారా లోకేష్, వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇతర నగరాలకు తరలించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బాధితుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ పారిశ్రామిక విపత్తుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాయి. సేల్ ( పరిధిలోని బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఇన్‌చార్జ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక సాంకేతిక కమిటీని రంగంలోకి దించారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు, నిర్వహణ లోపాలపై ఈ కమిటీ సమగ్ర విచారణ జరపనుంది. ఇప్పటికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలకు పాతిక లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే.. మృతుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల తక్షణ సాయాన్ని ప్రకటించారు. పరిశ్రమలలో ఇలాంటి పునరావృతం కాకుండా విశాఖ పరిసర ప్రాంతాల్లోని భారీ పరిశ్రమలన్నింటికీ సమగ్ర సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
http://www.teluguone.com/news/content/minister-nara-lokesh-visits-the-injured-and-assures-them-of-support-36-222342.html





