భధ్రతా సమీకరణాలను ప్రభావితం చేస్తున్న మిడిల్ ఈస్ట్ టెన్షన్స్
Publish Date:Apr 13, 2026
Advertisement
కంఠంనేని సీతారాం మధ్యప్రాచ్య ప్రాంతంలో మారుతున్న తాజా భౌగోళిక రాజకీయ పరిణామాలు గ్లోబల్ భద్రతా సమీకరణాలను వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న అస్థిరత ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది. అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేసిన దాడుల వెనుక చైనా ఆయుధ సంపత్తి, పాకిస్తాన్ రవాణా పాత్రఉందన్న అనుమానాలు, ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఇవి అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలు కేవలం ప్రాంతీయ ఘర్షణలుగా మిగిలిపోకుండా, దేశాల మధ్య పరోక్ష యుద్ధానికి దారితీసే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అమెరికా మాజీ భద్రతా సలహాదారు మైక్ ఫ్లిన్ చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి అద్దంపడుతున్నాయి. పాకిస్తాన్ ద్వారా చైనా క్షిపణులను ఉపయోగించి అమెరికా నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ చర్యేనన్నారాయన. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను పునర్నిర్మించుకోవడానికి చైనా ఇప్పటికే అవసరమైన ఇంధన తయారీ ముడి పదార్థాలను పలుమార్లు సరఫరా చేసినట్లు పశ్చిమ దేశాల నిఘా వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల దెబ్బతిన్న తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇరాన్ శ్రమిస్తోంది. ఈ వ్యూహాత్మక సరఫరా గొలుసులో పాకిస్తాన్ పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది. చైనా నుంచి ఇరాన్‌కు అందుతున్న క్షిపణి సాంకేతికత, ఆయుధ సంపత్తికి పాకిస్తాన్ ఒక ట్రాన్సిట్ పాయింట్ అంటే రవాణా మార్గంగా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి. రానున్న రోజుల్లో ఇరాన్‌కు కొత్త వాయు రక్షణ వ్యవస్థలను పంపేందుకు బీజింగ్ సిద్ధమవుతోందనీ, ఈ రవాణాపై ప్రపంచం దృష్టి పడకుండా ఉండేందుకు మూడవ దేశాల మార్గాలను, సరిహద్దులను చైనా వాడుకుంటోందనీ సమాచారం. చైనా, పాకిస్థాన్, ఇరాన్ ల యాక్సిస్ అమెరికా ప్రాబల్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు.. పెంటగాన్ మాజీ సలహాదారు, రిటైర్డ్ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ ఇరాన్ వ్యూహాత్మక ఆధిక్యాన్ని ధృవీకరించారు. ఇరాన్ ప్రస్తుతం ఒక బలమైన స్థితిలో ఉందన్న ఆయన ఇరాన్ పై పై చేయి సాధించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్గాలు తగ్గిపోతున్నాయని విశ్లేషించారు. ఒకవేళ ట్రంప్ తన వద్ద ఉన్న పూర్తి స్థాయి సైనిక శక్తిని ఉపయోగించినప్పటికీ, విజయం లభిస్తుందనే గ్యారెంటీ లేదని ఆయన కుండబద్దలు కొట్టేశారు. యుద్ధం వల్ల కలిగే పరాభవాన్ని తప్పించుకోవడానికి భారీ సైనిక మోహరింపు అవసరమవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. అదే సమయంలో పాకిస్తాన్ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. తీవ్రమైన అంతర్గత ఆర్థిక సంక్షోభం, నిరంతర రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. అమెరికా, ఇరాన్ మధ్య నిష్పాక్షిక మధ్యవర్తిగా వ్యవహరించగలదా అన్న సందేహాన్ని మాక్‌గ్రెగర్ వ్యక్తం చేశారు. చైనా ఆయుధాల పంపిణీలో భాగస్వామిగా ఉన్న దేశం శాంతి చర్చలకు వేదిక కావడం పలు అనుమానాలకు తీవిస్తోందన్నారు. చర్చల వైఫల్యానికి పాకిస్థాన్ పై విశ్వాసలోపం ప్రధాన కారణమన్నారు. అసలు ఈ చర్చలకు భారత్ వేదిక అయితే అవి సక్సెస్ అయి ఉండేవని డగ్లస్ మాక్‌గ్రెగర్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే భారతదేశం మధ్యవర్తిత్వానికి అత్యంత అనుకూలమైన స్థితిలో ఉందనీ, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలతో భారత్ కు బలమైన స్నేహపూర్వక సంబధాలు ఉన్నాయనీ అన్న ఆయన భారత విదేశాంగ విధానం కూడా సమతుల్యంగా ఉందనీ, అంతర్జాతీయ శక్తులతో సంభాషించగల సామర్థ్యం భారత్‌కు అతిపెద్ద బలమనీ ఆయన పేర్కొన్నారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదరకుండా ఉండాలంటే.. ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపి, ఈ సంక్షోభ పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక పోతే అమెరికా అంతర్గత భద్రతపై కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి. విదేశీ ముప్పు.. ముఖ్యంగా ఇరాన్ నుంచి వచ్చే ముప్పు చాలా వాస్తవమైనదని, అని భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని మైక్ ఫ్లిన్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గకపోవడాన్ని ఆయన ఈ సందర్భంగా ఎత్తి చేపారు. ఇరాన్ మీడియా ప్రచురించిన వీడియోల ప్రకారం, అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ద్వారా పైచేయిని నిరూపించుకోవాలని ఇరాన్ చూస్తున్నదన్నారు.
ప్రపంచం ప్రస్తుతం ఒక సున్నితమైన, అత్యంత ప్రమాదకరమైన దశలో ఉంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ కాదు, బహుళ శక్తుల మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధంగా పరిణమించింది. ఆధునిక యుద్ధ తంత్రాలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా, సాంకేతికత, క్షిపణి, గూఢచారి సంస్థల ద్వారా సాగుతున్నాయి. గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ మారుతున్న వేళ.. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, అదే సమయంలో చైనా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలే రాబోయే రోజుల్లో ప్రపంచ గమనాన్ని శాసించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభం నుండి బయటపడటం అంత సులభ సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/middle-east-tensions-influencing-security-equations-36-217222.html





