మమతకు త్రివేది షరతు
Publish Date:Mar 17, 2012
Advertisement
న్యూఢిల్లీ : పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరితే రాజీనామా చేసేందుకు సిద్ధమని కేంద్ర రైల్వేమంత్రి దినేష్ త్రివేది ప్రకటించారు. అయితే రాజీనామా చేయాలని స్వయంగా మమతా బెనర్జీ రాతపూర్వకంగా కోరాలని ఆయన షరతు విధించారు. రైల్వే చార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామా చేయాలని మమతా బెనర్జీ త్రివేదిని ఆదేశించడమే కాకుండా మంత్రివర్గం నుంచి త్రివేదిని తప్పించాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరిన విషయం తెలిసిందే. రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేయాలని తృణమూల్ కాంగ్రెసు చీఫ్ విప్ కళ్యాణ్ బెనర్జీ టెలిఫోన్‌లో త్రివేదికి సూచించారు. గౌరవంగా మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే వేటు వేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
పార్టీ నిర్ణయాన్ని మమతా బెనర్జీ తనకు రాతపూర్వకంగా తెలియజేయాలని త్రివేది అన్నట్లు బెనర్జీ చెప్పారు. రాతపూర్వకంగా రాజీనామా చేయాలని సూచించాలని త్రివేది అడగడం సరైంది కాదని ఆయన అన్నారు. మంత్రి పదవి తీసుకునేప్పుడు రాతపూర్వకంగా ఇవ్వాలని త్రివేది అడగలేదని ఆయన అన్నారు. మంత్రి పదవి తీసుకోవాలని పార్టీ సూచించినందున త్రివేదికి మంత్రి పదవి దక్కిందని, పార్టీ దిగిపోవాలని సూచించినప్పుడు గౌరవంగా తప్పుకోవాలని బెనర్జీ అన్నారు. ఒకటి రెండు రోజుల్లో త్రివేది రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అటు త్రివేదిని తొలగించే విషయంపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌పై ప్రధాని మాట్లాడేవరకూ ఆగాలని కాంగ్రెస్... తృణమూల్ నేతలను కోరినట్లు సమాచారం. ఈ నెల17వ తేదీ తర్వాత త్రివేది మంత్రి పదవిపై ప్రధాని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/mamatha-benarjee-24-12716.html





