ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు ఓటర్లకు వరాల జల్లులు
Publish Date:Mar 21, 2012
Advertisement
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు రాష్ట్రమంత్రులు వరాల జల్లులు కురిపిస్తున్నారు. త్వరలో ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ కు గట్టి పట్టున్న ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మంత్రులు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్ర న్యాయశాఖమంత్రి ఎరాసు ప్రతాపరెడ్డి, పశు సంవర్ధకశాఖ మంత్రి విశ్వరూప్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తామని, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఉపకార వేతనాలు కూడా మంజూరు చేస్తామని హామీలు ఇస్తున్నారు. దీనికితోడు వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నింటిని కొనసాగిస్తామని గట్టిగా హామీ ఇస్తున్నారు, ఆళ్ళగడ్డ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోతున్న శోభానాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డిలు కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్నికలప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటర్లు గుర్తుకు వస్తారని, ఎన్నికల తరువాత మంత్రులు, ప్రజాప్రతినిధుల జాడ కనిపించదని వారు విమర్శిస్తున్నారు. మంత్రుల ప్రలోభానికి లొంగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ప్రజలకు చేటు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kurnool-dist-allagadda-emmiganur-constituency-by-elections-24-12804.html





