రేవంత్‌రెడ్డితో 'కొండా' కిరికిరి.. అందుకు ఓకే అంటేనే హుజురాబాద్‌లో పోటీ!
Publish Date:Aug 20, 2021
Advertisement
హుజురాబాద్‌లో గెలుపెవరిది? చెప్పడం కాస్త కష్టమే. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ సాగుతోందక్కడ. కేసీఆర్ వర్సెస్ ఈటల ఎపిసోడ్ రంజుగా నడుస్తోంది. ఆ ఇద్దరు పోటుగాళ్ల పొట్లాటలో మధ్యలో దూరితే.. అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఆలస్యం చేస్తోంది. పోటుగాడనుకున్న కౌశిక్‌రెడ్డి.. హస్తానికి హ్యాండిచ్చి కారెక్కేయడంతో కాంగ్రెస్‌కు కేండిడేట్ లేకుండా పోయాడు. అందుకే రేసుగుర్రం కోసం పీసీసీ పెద్దలు వేట మొదలుపెట్టారు. కొండా సురేఖ అయితేనే.. రాణిరుద్రమలా హుజురాబాద్లొ యుద్ధ చేయగలరని దాదాపు డిసైడ్ అయ్యారు. అయితే, యుద్దానికి సిద్ధమే, కానీ..... మా కండీషన్స్ ఇవి అంటూ అధిష్టానం ముందు కొండా ఫ్యామిలీ కొన్ని కొర్రీలు పెట్టిందని తెలుస్తోంది. వాటికి సైతం పీసీసీ ఓకే అన్నట్టు సమాచారం. అసలే.. కొండా దంపతులు. కాంగ్రెస్‌కు కొరుకుడుపడని నేతలు. పార్టీలో ఉంటారనే పేరే గానీ.. ఎప్పుడూ పార్టీని పట్టించుకున్న పాపాన పోరు. తమ ఇలాఖాను తాము పరిపాలించుకుంటారంతే. అక్కడ వారు చెప్పిందే చెల్లుబాటు అవుతుందని అంటారు. ఇలా ఏళ్ల తరబడి శాయంపేట, పరకాలలను ఏలిన కొండా ఫ్యామిలీ.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరి.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా కొండా సురేఖ, ఎమ్మెల్సీగా కొండా మురళీ గెలిచారు. ఐదేళ్లు వరంగల్ సిటీలో ఆగమాగం చేశారని చెబుతారు. కాంగ్రెస్ స్టైల్ పాలిటిక్స్ గులాబీ బాస్‌కు నచ్చకపోవడంతో గత ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వలేదు. వెంటనే మళ్లీ హస్తం కండువా కప్పేసుకొని.. వరంగల్ నుంచి తన పాత నియోజకవర్గమైన పరకాల సిఫ్ట్ అయిపోయి.. కాంగ్రెస్ తరఫున పోటీచేసి.. ఓడిపోయారు. ఓటమి భారంతో హైదరాబాద్‌లో తలదాచుకుంటూ.. కాంగ్రెస్‌లో కామ్‌గా ఉండిపోయారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రావడం.. కొండా సురేఖ ఇంటికెళ్లి మరీ మద్దతు కోరడంతో.. పార్టీలో మళ్లీ కొండా డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ ప్రాంతంపై కొండా దంపతులకు పట్టు ఉండటంతో.. కాంగ్రెస్ తరఫున కొండా సురేఖను బరిలోకి దింపాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఓటమికి బెదరని, భయపడని కొండా దంపతులు హుజురాబాద్ సవాల్‌ను స్వీకరించేందుకు సై అంటున్నారు. కాకపోతే వారు కొన్ని కండీషన్స్ పెడుతున్నారని అంటున్నారు. గెలిచినా, ఓడినా ఇప్పుడు హుజురాబాద్ బరితో దిగుతాం.. అందుకు ప్రతిఫలంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పరకాల, వరంగల్ తూర్పు, భూపాలపల్లి సీట్లు ఇవ్వాలనేది వారి డిమాండ్. కొండా సురేఖ, కొండా మురళిలతో పాటు వచ్చేసారి వారి కూతురు సుష్మిత సైతం రాజకీయ అరంగేట్రం చేయనున్నారని తెలుస్తోంది. అందుకే, తమ కుటుంబానికి ఆ మూడు సీట్లు ఇస్తానంటేనే.. ఇప్పుడు హుజురాబాద్‌లో పోటీ చేసి సత్తా చాటుతామని కిరికిరి పెట్టారట. పరకాల, వరంగల్ తూర్పుల విషయంలో పీసీసీ సైతం సరేనన్నా.. భూపాలపల్లి సీటులో మాత్రం కాస్త కాంట్రవర్సీ వచ్చిందట. ఇటీవల కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకొచ్చిన గండ్రా సత్యనారాయణ భూపాలపల్లిలో బలమైన నాయకుడు. ఆయన అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. గండ్రను కాదని కొండాకు ఇవ్వడం.. అదీకాకుండా ఎంత గెలిచే సత్తా ఉన్నా.. ఒకే ఫ్యామిలీకి మూడు సీట్లు ఇవ్వడం కాస్త ఇబ్బందికరమేనంటున్నారు. కొండా దంపతులు మాత్రం తమకు ఆ మూడు అసెంబ్లీ స్థానాలు ఇస్తానంటేనే.. హుజురాబాద్‌లో పోటీ చేస్తామంటోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో బీసీల ప్రాబల్యం ఎక్కువ. కొండా సురేఖ పద్మశాలి, కొండా మురళి మున్నూరుకాపు కావడంతో.. పెద్ద సంఖ్యలో ఉన్న ఆ రెండు సామాజిక వర్గాల ఓట్లు కాంగ్రెస్‌కే పడుతాయనేది రేవంత్‌రెడ్డి లెక్క. పైగా మహిళా అభ్యర్థి. అందుకే, మిగతా పీసీసీ సభ్యులను ఒప్పించి మరీ కొండా కండీషన్స్‌కు ఓకే చెప్పారని తెలుస్తోంది. త్వరలోనే హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. అదే జరిగితే.. హుజురాబాద్‌లో ట్రయాంగిల్ వార్ రంజుగా సాగడం ఖాయం.
http://www.teluguone.com/news/content/konda-family-demands-at-revanth-reddy-39-121786.html





