చక్రం తిప్పలేకపోతున్న మంత్రి సుదర్శన్ రెడ్డి
Publish Date:Mar 9, 2012
Advertisement
కామారెడ్డి: కామారెడ్డి ఉప ఎన్నికలు రాష్ట్రమంత్రి సుదర్శన్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. ఆయన కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా ఆ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే గ్రూపు తగాదాలు, కార్యకర్తల సహాయం నిరాకరణ,తెరాస జోరు ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బోధన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయిన సుదర్శన్ రెడ్డి మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే రెండు దశాబ్దాల రాజకీయజీవితం గల సుదర్శన్ రెడ్డి బోధన్ నియోజకవర్గాన్ని దాటివేళ్ళి ఎన్నికల ప్రచారం చేసిన సందర్భాలు లేవు. నిజానికి ఆయన ఎన్నికల సమయంలోనే బోధన్ లో ఉంటారు. మిగతా సమయమంతా హైదరాబాద్ లోనే వ్యాపార, పారిశ్రామిక లావాదేవీలు చూసుకుంటూ ఉంటారు. ఆయన బయటకు వస్తే మినరల్ వాటర్ తప్ప మరేమీ ముట్టుకోరు. అటువంటి వ్యక్తికి కామారెడ్డి ఇన్ ఛార్జి బాధ్యలు అప్పగించడంతో ఆయన సతమతమవుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రోజూ ఆయనతో ఫోన్ లో మాట్లాడి తాజా పరిస్థితులు అడిగి తెలుసుకోవడంతో సుదర్శన్ రెడ్డి మరింత బాధ్యత ఫీలై ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఆయన వ్యవహార శైలి, మాటతీరు కార్యకర్తలలో ఉత్సాహం నింపలేకపోతోంది. బోధన్ లో చక్రం తిప్పిన సుదర్శన్ రెడ్డి కామారెడ్డిలో మాత్రం ఆ చక్రాన్ని తిప్పలేకపోతున్నారు.
http://www.teluguone.com/news/content/kmareddy-24-12508.html





