కరీంనగర్‌లో ఏటీఎం దొంగల కలకలం.. లేడీ గెటప్‌తో షాక్..!
Publish Date:Sep 20, 2026
Advertisement
లేడీ గెటప్‌లో వచ్చి.. సీసీటీవీలపై స్ప్రేలతో దాడి..! అర్ధరాత్రి దాటింది.. అంతా గాఢ నిద్రలో ఉన్న వేళ దొంగల ముఠా రంగంలోకి దిగింది. టార్గెట్ ఒక్కటే.. ఎస్బీఐ ఏటీఎంలు! పక్కా ప్లాన్‌తో వచ్చిన దుండగులు.. ఒకచోట గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేయగా.. మరోచోట ఏకంగా లేడీ గెటప్‌లో వచ్చి సీసీటీవీ కెమెరాలపై స్ప్రే కొట్టి తమ ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా దుర్షేడ్, తిమ్మాపూర్ ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ జిల్లా దుర్షేడ్‌లో తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో స్కార్పియో వాహనంలో వచ్చిన ముగ్గురు దుండగులు ఎస్బీఐ ఏటీఎంను టార్గెట్ చేశారు. ముందుగా సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసిన దుండగులు.. ఆ తర్వాత గ్యాస్ కట్టర్‌తో క్యాష్ మిషన్‌ను కట్ చేసి నగదును ఎత్తుకెళ్లారు. అనంతరం అదే స్కార్పియో వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. ఇక తిమ్మాపూర్‌లోని మరో ఎస్బీఐ ఏటీఎం వద్ద దొంగలు అనుసరించిన పద్ధతి మరింత ఆసక్తికరంగా ఉంది. లేడీ గెటప్‌లో వచ్చిన దుండగులు ముందుగా సీసీటీవీ కెమెరాలపై స్ప్రే కొట్టారు. తమ కదలికలు కెమెరాల్లో స్పష్టంగా రికార్డు కాకుండా జాగ్రత్తలు తీసుకున్న అనంతరం ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. ఒకే రాత్రి రెండు ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేయడం.. అందులోనూ ఒకచోట కెమెరాలను ధ్వంసం చేయడం, మరోచోట కెమెరాలపై స్ప్రే కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల కదలికలపై ఆరా తీస్తున్నారు. చోరీకి ఉపయోగించిన స్కార్పియో వాహనం ఏ దిశగా వెళ్లిందనే దానిపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు ఘటనల వెనుక ఒకే ముఠా ఉందా? లేక వేర్వేరు ముఠాలా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కెమెరాలకు చిక్కకుండా లేడీ గెటప్.. ఏటీఎంను ధ్వంసం చేసేందుకు గ్యాస్ కట్టర్.. తప్పించుకునేందుకు స్కార్పియో.. ఇలా పక్కా ప్లాన్‌తో జరిగిన వరుస ఏటీఎం చోరీలు కరీంనగర్‌లో కలకలం రేపుతున్నాయి. [ Karimnagar ATM Robbery, SBI ATM Theft, ATM Robbery, Lady Getup Robbery, CCTV Spray, Gas Cutter, ATM Burglary, Durgshed ATM Theft, Thimmapur ATM Robbery, Scorpio Vehicle, Telangana Crime, Karimnagar Crime, ATM Thieves, Police Investigation ]
http://www.teluguone.com/news/content/karimnagar-atm-robbery-24-231947.html




