కన్నాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాయపాటి, మోదుగుల
Publish Date:Mar 9, 2012
Advertisement
గుంటూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి గుంటూరు జిల్లాలో అడకత్తెరలో పోక చెక్కలా తయారయింది. ఆయనను ఒకవైపు గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు, మరోవైపు నర్సరావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. కొంతకాలం క్రితంవరకు రాయపాటి-కన్నాలు బహిరంగంగానే ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. సవాళ్లకు ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ఒకడి పరువును మరొకరు మంట గలుపుకున్నారు. చివరకు రాయపాటి కన్నాపై కోట్లాది రూపాయల పరువునష్టం దావా కూడా వేశారు. ఈ దావా వ్యవహారం ఇంకా సద్దుమణగకుండానే ఇప్పుడు నర్సరావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి కన్నాపై విరుచుకుపడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణకు వ్యవసాయశాఖ కేటాయించడం ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పుల్లో ఒకటని ఆయన అంటున్నారు. విత్తనాల కంపెనీలపై దాడులు చేయించి జేబులు నింపుకునేందుకు మాత్రమే ఆయనకు వ్యవసాయశాఖ పనికి వచ్చిందని ఆరోపించారు. ఇప్పుడు కన్నా యూరియా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించి రైతులపై భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన స్వప్రయోజనాలకోసం కోట్లాది రూపాయలు ఆర్జించుకోవడానికే తన మంత్రి పదవిని ఉపయోగిస్తున్నారని, ఆయనవల్ల జిల్లాకుగాని, రాష్ట్రానికిగాని ఎటువంటి ప్రయోజనం లేదని ఎంపి మోదుగుల విమర్సించారు.
http://www.teluguone.com/news/content/kanna-lakshminarayana-24-12500.html





