కాకాణికి జైలు గండం?
Publish Date:Mar 25, 2025
.webp)
Advertisement
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీలో అంతో ఇంతో యాక్టివ్‌గా ఉన్న కాకాణి చుట్టూ ఉచ్చు బిగుస్తుండటం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. తాజాగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. మరో వైపు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఎంపీ సంతకాల ఫోర్జరీ కేసులో సైతం కాకాణిని నిందితుడిగా చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్ కుంభకోణం వెనుక కూడా కాకాణి హస్తం ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతో కాకాణికి కష్ట కాలం తప్పదంటున్నారు.
తాజా కేసుతో మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్దమైనట్లు జరుగుతున్న ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది . ఓ మైన్ ని కొల్లగొట్టి అక్రమంగా 250 కోట్ల రూపాయలకు పైగా దోచేసినట్లు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు మేరకు మైనింగ్, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ అభియోగంపై కేసులు కూడా నమోదు చేశారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఈ కేసులో నాలుగో నిందితుడిగా చేర్చారు.
కాకాణి అక్రమాలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర మైనింగ్ శాఖతో పాటు కేంద్ర మైనింగ్ శాఖలకు కూడా ఫిర్యాదు చేశారు. 250 కోట్ల విలువైన ఖనిజ సంపాదన దోచుకున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైసిపి ప్రభుత్వంలో అదే మైన్స్ వద్ద సోమిరెడ్డి మూడు రోజుల పాటు సత్యాగ్రహ దీక్ష కూడా చేశారు. మైనింగ్ లోడ్లతో రవాణాకు సిద్ధంగా ఉన్న 40 లారీలను తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. అప్పట్లో అది పెద్ద కలకలమే రేపింది.
వైసీపీ ప్రభుత్వంలో న్యాయం జరగదని భావించిన సోమిరెడ్డి కేంద్ర మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేశారు. కేంద్రం ఆదేశాలకు తోడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ కేసుకు ప్రాణం వచ్చింది. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కాకాణి స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే గత ప్రభుత్వంలో మంత్రిగా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన కాకాణికి జైలు గండం పొంచి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది
http://www.teluguone.com/news/content/jail-fear-to-former-minister-kakani-39-194992.html












