విశాఖలో జూబ్లీహిల్స్.. జగనన్న మూవీ డ్రీమ్స్..
Publish Date:Feb 12, 2022
Advertisement
ఈ వారంలో బాగా వైరల్ అయిన వీడియోలు రెండు. ఒకటి.. సీఎం జగన్‌ను.. తల్లిలాంటి మీ చల్లని చూపు కావాలంటూ మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి వేడుకోవడం.. ఇక, రెండో వీడియో.. సినిమా వాళ్లు విశాఖకు షిఫ్ట్ అవండి.. మీకు కళ్ల స్థలాలు ఇస్తా.. స్టూడియోలకు భూములిస్తా.. విశాఖలో జూబ్లీహిల్స్ తయారు చేద్దాం.. అంటూ జగనన్న డైలాగ్స్ చెప్పిన వీడియో. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక చిరు వేడుకోలుపై తీవ్ర విమర్శలు వస్తుండగా.. తన జేబులో నుంచి భూములు ఇస్తానన్నట్టు మాట్లాడిన జగన్‌రెడ్డి దానగుణంపై జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన బంపర్ ఆఫర్‌పై ఇండస్ట్రీలో డివైడ్ టాక్ నడుస్తోంది. మొత్తానికి ఆ ఎడిటెడ్ వీడియోలు మాత్రం అదుర్స్. ఇక, అదే వీడియోలో ఇంకొంచెం ముందుకు వెళితే.. జగనన్న అసలు నిజం ఒప్పేసుకున్నారు. ఇప్పుడు కాకపోయినా.. ఇంకో 10..15..20 ఏళ్లకైనా విశాఖ.. హైదరాబాద్ స్థాయికి చేరుతుందంటూ ఆయనే సెలవిచ్చారు. ఇదీ అసలు సంగతి. అంటే, హైదరాబాద్‌తో పోలిస్తే.. వైజాగ్ ఇప్పటికీ ఎంతో వెనకబడి ఉన్నట్టే కదా? మరి, 20 ఏళ్ల తర్వాత డెవలప్ అయ్యే సిటీకి.. సినిమావాళ్లు ఇప్పుడే షిఫ్ట్ అవుతారా? అందులోనూ జగన్ మాటలు నమ్మి.. అమరావతిలా నట్టేట మునిగేందుకు ముందుకొస్తారా? అంటే డౌటే అంటున్నారు. మద్యపాన నిషేధం.. ఉచిత ఇసుక.. సీపీఎస్ రద్దు.. పీఆర్సీ.. ఇలా ప్రతీ విషయంలోనూ మాట తప్పే, మడమ తిప్పే.. యూటర్న్ సీఎంను నమ్మేదెవరు? అంటున్నారు. ఇప్పటికే విశాఖలో రామానాయుడు స్టూడియోస్ ఉండనే ఉన్నాయి. వాటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే. ఆ ఎగ్జాంపుల్ కళ్లముందు కనిపిస్తుండగా.. ఇక జగన్ పిలిచారంటూ పోలోమంటూ వెళ్లి.. కేవలం స్థలాలకు కక్కుర్తిపడి.. సొంత డబ్బులతో.. స్టూడియోలు, ఇళ్లు కట్టుకునేంత వెర్రిపప్పలు కాకపోవచ్చు సినిమా పెద్దలు. అయినా, విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీ, జూబ్లీహిల్స్ తీసుకురావడం ఎవరి కోసం? నిజంగా సినిమా వాళ్ల కోసమేనా? అంటే అనుమానమే. సాధారణంగా సినిమా పరిశ్రమ ఏ నగరంలో ఉంటే అది గోల్డెన్ సిటీగా మారుతుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. అక్కడ 100 గజాల స్థలం కూడా కోట్లు పలుకుతుంది. అందుకే, విశాఖను బంగారుకొండ చేయాలనే లక్ష్యంతోనే.. జగనన్న టాలీవుడ్‌కు భూముల బిస్కెట్లు వేస్తున్నారని అంటున్నారు. అయితే, ఆ బంగారు కొండ జనం కోసం మాత్రం కాకపోవచ్చు! వైసీపీ పెద్దల కోసమని వేరే చెప్పనక్కర్లేదు!! ఇప్పటికే, తాడేపల్లి ప్యాలెస్ సామంతరాజు విజయసాయిరెడ్డి విశాఖలో మకాం వేసి.. ఎక్కడెక్కడో ఉన్న భూములపై కర్చీఫ్ వేశారని అంటున్నారు. దారికి రాని వారిని.. కూల్చివేతల పేరుతో భయభ్రాంతులకు గురిచేసి.. వైజాగ్‌ను తన కబందహస్తాల్లో బంధించారనే ఆరోపణలు ఉన్నాయి. అలా తమ ఆధీనంలో ఉన్న భూమంతా బంగారం కావాలంటే? రెండే రెండు మార్గాలు.. 1.విశాఖను ఏపీ రాజధానిగా చేయడం. 2.టాలీవుడ్‌ను విశాఖకు తీసుకురావడం. ఈ రెండిట్లో ఏది జరిగినా.. కొందరు పెద్దలకు బంగారు గని దొరికినట్టే అంటున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేయాలనే ప్లాన్-A వర్కవుట్ కాకపోవడంతో.. ఫిల్మ్ ఇండస్ట్రీని వైజాగ్‌కు రప్పించాలనే ప్లాన్-Bని ఇంప్లిమెంట్ చేస్తున్నారనే అనుమానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఏపీకి పూర్తి స్థాయి రాజధానిగా విశాఖను ప్రకటిస్తారని అంటున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తే కోర్టు ఒప్పుకోవడం లేదు కాబట్టి.. ఏకంగా కేపిటల్‌నే ఏకమొత్తంగా మార్చేయాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ విషయంలో మార్చి మొదటివారంకల్లా ఓ నిర్ణయం వస్తుందని అంచనా వేస్తున్నారు. రాజధానిగా ప్రకటించినంత మాత్రాన విశాఖకు అదనంగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. జగన్‌రెడ్డి తీరు చూసి వైజాగ్‌కు పెట్టబడులేమీ తరలి రాకపోవచ్చు అంటున్నారు. అందుకే, బెదిరిస్తే భయపడిపోయే టాలీవుడ్‌ను టార్గెట్ చేశారని చెబుతున్నారు. అందులో భాగంగానే.. ముందుగా టికెట్ రేట్లు తగ్గించి.. పరిశ్రమ వర్గాలను దారికి తెచ్చుకొని.. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరిగేలా చేసుకొని.. అలా ఆకలితో నకనక మాడ్చి.. వలవల ఏడిపించి.. ఇప్పుడు మీకు బిర్యానీ పెడతా.. విశాఖకు రండంటూ జగన్నాటకం ఆడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏ రోజుకారోజు అప్పుల మీద బతుకుతున్న ప్రభుత్వాన్ని నమ్మి.. పులి బోనుకు చిక్కుతారా? డబ్బుల కోసం పార్కులనే తాకట్టు పెట్టే సర్కారును సినిమావాళ్లు నమ్ముతారా? వైజాగ్‌లో ఇళ్లు, స్టూడియోలు కడతారా? విశాఖలో జూబ్లీహిల్స్ తయారు చేస్తారా?
http://www.teluguone.com/news/content/inside-facts-on-jubilee-hills-in-vishaka-39-131657.html





