మోదీపై కేసీఆర్ ఫైర్.. జగన్ కూల్.. ఎవరికి ఫ్లవర్?
Publish Date:Feb 12, 2022
Advertisement
బడ్జెట్‌పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే క్రమంలో అటు రాజ్యసభలో... ఇటు లోక్‌సభలో... ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలు.... తెలంగాణలో కాక పుట్టిస్తుంటే.. ఏపీలో మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉంది. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కూర్చి ఎక్కాలని.. ఆ క్రమంలో కమలం పార్టీని దెబ్బకొట్టాలని.. భావిస్తున్న గులాబీ బాస్ కేసీఆర్‌కు ప్రధాని మోదీ కామెంట్స్ అందివచ్చిన అవకాశంగా భావిస్తుందీ కారు పార్టీ. ఆ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీపై కారు పార్టీ క్యాడరంతా కారాలు మిరియాలు నూరుతూ ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేస్తున్నాయి. ఆ క్రమంలో పలు చోట్లు ఉద్రికత్త పరిస్థితుల నెలకొన్నాయి. ఇక సోషల్ మీడియా సాక్షిగా బీజేపీని గులాబీ పార్టీ ఓ రేంజ్‌లో ఎండగడుతోంది. పోలిటికల్ మైలేజ్ కోసం.. గులాబీ పార్టీ ఈ విధంగా చేస్తుందని.. అందులోభాగంగా ప్రధాని విభజన వ్యాఖ్యలను ఆయుధంగా మలుచుకొని బీజేపీపై కారు పార్టీ దండయాత్రకు దిగిందనే టాక్ ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. రాష్ట్ర విభజనతో ఏమాత్రం నష్టపోని... తెలంగాణలో పరిస్థితి ఈ విధంగా ఉంటే.. మరోవైపు విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు ఏం చేయాలి.. ఓ రేంజ్‌లో చెలరేగిపోవాలి... విభజనతో తీవ్ర నష్టం వాటిల్లిందని సాక్షాత్తూ ప్రధాని మోదీనే ప్రకటించడంతో ... మీరన్నది అక్షరాల నిజమంటూ ఆయనకు దండేసి దణ్ణం పెట్టి... అవసరమైతే ఆయనకు సభలోనే సాష్టాంగ నమస్కారం చేయాలి. కానీ మన అధికార పార్టీ ఎంపీలు కానీ, ప్రతిపక్ష టీడీపీ ఎంపీలు కానీ ఆ పని చేయకపోగా.. వారు మౌనంగా ఉండడం ఎంత వరకు సబబు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విభజనపై ప్రధాని మోదీ చేసిన కామెంట్స్‌పై సభలో నోటిసులు ఇవ్వడంటూ ఆంధ్ర ఎంపీలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచిస్తే.. దీనిపై ఏపీ ఎంపీలు నుంచి కనీస స్పందన లేకుండా పోయిందీ. రాష్ట్రంలో ఏ పార్టీలో అయినా..సీనియర్లు అనేవారు లేకుండా పోయారు. ఇలా చేస్తే.. మనకు మంచి జరుగుతోంది. ఇలా చేయండి.. దీని వల్ల లాభం కలుగుతోందని చెప్పే వారు ఒక్కరు లేకుండా పోయారు. ఏదో గుడ్డిలో మెల్లలాగా.. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాటలను కూడా.. ఈ ఎంపీలు లైట్ తీసుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మన సోకాల్డ్ ప్రజా ప్రతినిధులు బేకార్ గాళ్లు అనే నిర్ణయానికి అయితే ప్రజలు వచ్చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏదో ముంచుకోస్తున్నట్లు.. ఏదో మించి పోయినట్లు.. ప్రజల ముందుకు వచ్చి.. అయ్యా ఓటు... అమ్మా ఓటు.. అంటూ.. అదీకాక పోతే.. ప్రజల ఓటును నోటుతో కొట్టవచ్చనే ధీమాతో ఈ సదరు ప్రజాప్రతినిధులు క్లియర్ కట్‌గా ఉన్నారు. అందుకోసం.. రానున్న ఎన్నికల్లో తమ గెలుపు కోసం ఎంత ఎంత ఖర్చు పెట్టాలనే కోణంలో.. నగదును విచ్చలవిడిగా సంపాదించేస్తున్నారు. ప్రజలు కూడా అదే తరహాలో రాష్ట్రం ఏమైపోతే మాకేంటి మా కులాలు.. మా కుల నాయకులు, మా ప్రాంతాలు.. మా ప్రాంత నాయకులు, మా వర్గాలు.. మా పార్టీలు.. అంటూ వాటిని కాపాడుకోవడంలో నిమగ్నమైపోయారు. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో ఓటుకు ఎన్ని వేలు ఇస్తారు.. అయిదా ? .. పదా ? ఎంత ఇచ్చినా.. ఒకే అనే మైకంలోకి ప్రజలు చల్లగా జారిపోయారు. రాష్ట్రం ఏమైపోతే మాకేంటి.. వాళ్లు సైలెంట్.. వీళ్లు సైలెంట్.. యథా రాజా.. తథా ప్రజా. ప్రజాస్వామ్య దేశానికి కావాల్సిందే ఇదే కదా.
http://www.teluguone.com/news/content/jagan-cool-strategy-on-modi-39-131653.html





