తెలంగాణకు అధిష్టానం రాజకీయ ఫార్ములా
Publish Date:Feb 27, 2012
Advertisement
హైదరాబాద్ : రూ.20వేల కోట్ల నిధులతో అతి త్వరలోనే తెలంగాణ ప్రాంత అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సమస్యకు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చూపిన ఆరు పరిష్కారాల్లో... ప్రస్తుతానికి, చివరి దానికే అధిష్ఠానం ఓటు వేసినట్లు తెలుస్తోంది. 'రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. అదే సమయంలో... తెలంగాణ ప్రాంత, సామాజిక, ఆర్థికాభివృద్ధికి, ఈ ప్రాంత రాజకీయ సాధికారతకు వీలుగా తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి'' అని శ్రీకృష్ణ కమిటీ ఆరో సిఫారసు చెబుతోంది.
కమిటీ సిఫారసులు, విభజన సంగతి పక్కనపెడితే... తెలంగాణ ప్రాంతంలో పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకే 'అభివృద్ధి మండలి + భారీ ప్యాకేజీ' అనే రాజకీయ ఫార్ములా కనిపెడుతున్నట్లు చెబుతున్నారు. అభివృద్ధి మండలి ఏర్పాటైతే తెలంగాణ ప్రాంత ముఖ్యనేతకు కీలకమైన చైర్మన్ పదవి దక్కుతుంది. ఇదే సమయంలో, కేవలం అభివృద్ధి మండలితో సరిపుచ్చకుండా... ప్రతిష్ఠాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే... ప్రజల్లోకి ధీమాగా వెళ్లవచ్చునని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతంలోని ప్రతి గ్రామానికీ అభివృద్ధి నిధులు చేరేలా ప్రణాళికలు రూపొందించాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తోంది.
రాష్ట్ర కాంగ్రెస్‌లో, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంత నేతల్లో నైరాశ్యం నెలకొందని అధిష్ఠానం గుర్తించినట్లు రాష్ట్ర నేతలు వివరిస్తున్నారు. దీనిని తక్షణమే తొలగించకుంటే పార్టీ మనుగడకు ముప్పేనని అధిష్ఠానం ఆందోళన చెందుతోంది. పదవుల పంపిణీలో, ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ ప్రాంతం పట్ల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కన్పిస్తోందన్న ఆగ్రహం, అసహనం ఈ ప్రాంత నేతల్లో ఉన్నట్లు అధిష్ఠానం గుర్తించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని భావిస్తోంది. రాష్ట్రం నుంచి హస్తినకు వెళ్లిన ప్రతి నేతకూ అధిష్ఠానం పెద్దల నుంచి ఇవే సంకేతాలు అందుతున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం నిలబడేందుకు అవసరమైన ఎంపీలను పెద్దసంఖ్యలో అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోరాదని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఇప్పటి నుంచైనా రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనే ఆలోచనకు వస్తోంది.
http://www.teluguone.com/news/content/hyderabad-24-12239.html





