మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు తిరస్కరణ.. వైసీపీ పునాదులు కదులుతున్నట్లేనా?
Publish Date:Apr 4, 2025

Advertisement
కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది. బంతి దెబ్బ నుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. వైసీపీ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నతలు కర్మఫలం అనుభవించడానికి రెడీ కావలసిన పరిస్థితి ఏర్పడింది.
ఐదేళ్ల జగన్ పాలనలో వైసీపీ నేతలు ఇష్టారీతిగా వ్యవహరించారు. అధికార మదంతో అక్రమర్జనకు పాల్పడ్డారు. ఆ పార్టీ అధినేత జగన్ దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమతో హద్దులు మీరి ప్రవర్తించారు. ప్రతిపక్ష పార్టీల నేతలను ఇబ్బందులకు గురిచేశారు. సామాన్య ప్రజలను వదలకుండా వేధింపులకు పాల్పడ్డారు. అప్పటి విపక్ష నేతలపైనా, వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చి పోయారు. అక్రమ కేసులు బనాయించి జైళ్లకు సైతం పంపించారు. ఆ పాపాలన్నిటికీ ఇప్పుడు ఫలితం అనుభవించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. జగన్ ఐదేళ్ల అరాచకపాలనకు విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. కనీసం విపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదంటూ వారిని రాష్ట్రంలో కేవలం 11 నియోజకవర్గాలకే పరిమితం చేశారు. తెలుగుదేశం కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టి అధికారం అప్పగించారు. దీంతో అధికారంలో ఉండగా హద్దులు మీరి ప్రవర్తించిన, అక్రమార్జనకు తెగబడిన నేతలపై ఇప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూటమి సర్కార్ సమాయత్తమైంది. వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలను వెలికితీసి వారిపైనా, అలాగే అధికార మదంతో నోరుపారేసుకున్న నేతలపైనా కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకునే కార్యక్రమం చేపట్టింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడిన పార్టీ నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే అధికారం అండతో కనీస విలువలకు తిలోదకాలిచ్చి బూతులతో రెచ్చిపోయిన నేతలపైనా కేసులు నమోదౌతున్నాయి. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి సహా పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వీరిలో పోసాని కృష్ణ మురళి బెయిలుపై బయటకు రాగా, వంశీ ఇంకా జైల్లోనే ఉన్నారు. అలాగే పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా కటకటాలు లెక్కిస్తుండగా, మరి కొందరు కోర్టుల ద్వారా ముందస్తు బెయిలు పొంది విచారణలకు హాజరౌతున్నారు. ఇంకొందరు అజ్ణాతంలో ఉన్నారు. మరి కొందరు బెయిలు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ఏపీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చుక్కెదురైంది.
జగన్ హయాంలో రాష్ట్రంలో మద్యం తయారీ, విక్రయాలలో భారీ ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంపై దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. దీంతో అరెస్టు భయంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిలు పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. మిథున్ రెడ్డి బెయిలు పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మిథున్ రెడ్డి ముందస్తు బెయిలును ఏపీ హైకోర్టు కొట్టివేయడం ఒక్క మిథున్ రెడ్డికి మాత్రమే కాకుండా మొత్తం వైసీపీకే పెద్ద ఝలక్ గా పరిశీలకులు భావిస్తున్నారు. ఈ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లు వైసీపీ పునాదులు కదిలే అవకాశాలున్నాయని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/high-court-rejects-mp-mithunreddy-anticipatory-bail-petition-39-195581.html












