పిఠాపురం వర్మకు చంద్రబాబు షేక్ హ్యాండ్.. గ్యాప్ ప్రచారానికి ఎండ్ కార్ట్!
Publish Date:Apr 13, 2025

Advertisement
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుక విజయవాడలో శనివారం ఘనంగా జరిగింది. ఈ కర్యక్రమానికి తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచీ తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉమా కుమారుడి నిశ్చితార్థ వేడుకకు పిఠాపురం వర్మ కూడా వచ్చారు. పిఠాపురం వర్మను చూడగానే చంద్రబాబు ఆప్యాయంగా దగ్గరకు పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఫొటో, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి గత కొన్ని నెలలుగా పిఠాపురం వ్యవహారాలు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి కృషి చేసిన వర్మకు న్యాయం జరగలేదన్న అసంతృప్తి తెలుగుదేశం క్యాడర్ లో బలంగా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వర్మ అన్ని ఏర్పాట్లూ చేసుకుని కూడా జనసేన, బీజేపీతో టీడీపీ పొత్తు కారణంగా ఆ సీటును జనసేనకు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించి, పొత్తు నేపథ్యంలో మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వాల్సి ఉందని చెప్పగానే క్షణం ఆలోచించకుండా తన సీటును పవన్ కోసం త్యాగం చేసి చంద్రబాబు మాటకు ఏమాత్రం ఎదురు చెప్పని ఆ ఎన్నికల్లో ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం శ్రమించారు.
అక్కడి వరకూ అంతా బానే ఉన్నా.. ఆ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఇప్పటిదాకా నెరవేరలేదు. రెండు దఫాలుగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా వర్మకు ఛాన్స్ దక్కలేదు. అలాగే నియోజకవర్గంలో వర్మ ప్రాధాన్యతను తగ్గించే విధంగా జనసేన పావులు కదపుతూ వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగింది. అందుకు తగ్గట్టుగానే..ఇటీవల ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజకవర్గ పర్యనటలో వర్మకు ఆహ్వానమే లేకుండా పోయింది. అంతకు ముందు కూడా జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
దీంతో తెలుగుదేశం శ్రేణులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నాగ బాబు పిఠాపురం పర్యటన ఆద్యంతం అడుగడుగునా తెలుగుదేశం నిరసనలు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల వర్మ కాకినాడలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో లోకేష్ కు పగ్గాలు, అలాగే 2047 విజన్ డాక్యుమెంట్ లా పార్టీ కోసం కూడా ప్రణాళిక రూపొందించాల్సి ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు పిఠాపురం వర్మను ఆప్యాయంగా పలకరించడం, షేక్ హ్యాండ్ ఇచ్చి ముచ్చటించడంతో వర్మలో అసంతృప్తి అంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వర్మతో చంద్రబాబు ఆత్మీయంగా మాట్లాడటం తెలుగుదేశం శ్రేణుల్లో కూడా జోష్ ను నింపింది.
http://www.teluguone.com/news/content/cbn-shakehand-with-pithapuram-verma-39-196143.html












