దొంగదీక్ష జగన్:హరీష్ రావు
Publish Date:Jan 10, 2012
Advertisement
సిద్దిపేట: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రైతు దీక్ష దొంగదేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రైతు చైతన్య యాత్ర, జగన్ రైతు దీక్షలు అన్ని దొంగవేనని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్నవేనని ఆయనఅన్నారు. తెలంగాణ రైతాంగం హక్కుల గురించి వారు ఎందుకు ప్రశ్నించరని అడిగారు. జగన్ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తెలంగాణ వాదులపై దాడులకు పాల్పడటం దారుణమని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు వైఖరి తెలుపకపోవడమే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం చెప్పారని, ఈ మూడు పార్టీలు నిర్ణయం ప్రకటిస్తే ముందుకెళ్తామని హోంమంత్రి చెప్పారని, అందువల్ల ఆ పార్టీలు స్పష్టమైన వైఖరి వెల్లడించేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన అన్నారు. తెలంగాణలో పర్యటిస్తే నిరసనలు ఎదుర్కోక తప్పదన్నారు.జగన్ పరామర్శ యాత్రల పేరిట దండయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పంటలు నష్టపోయి నిండా మునిగినా రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో సరిపెట్టుకోవాలనడం ఏం న్యాయమని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఎందుకివ్వరని ప్రశ్నించారు. కరెంటు కోతల విషయంలో కూడా ప్రభుత్వం వివక్షత కనబరుస్తున్నదని విమర్శించారు. తెలంగాణ రైతుల పట్ల ప్రభుత్వం కనబరుస్తున్న వివక్షపట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడులు,వైఎస్.జగన్మోహన్రెడ్డిలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పైసా పెట్టుబడి పెట్టకుండా పంట విరామం ప్రకటించిన ఆంధ్రా ప్రాంతంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇస్తున్నారు. ఆంధ్రాప్రాంతం కంటే తెలంగాణలోని గ్రామాలకు తక్కువ కరెంటు ఇస్తున్నారని చెప్పారు. రైతు పోరుబాట, రైతు దీక్షల పేరిట తెలంగాణలో పర్యటిస్తున్న చంద్రబాబు, జగన్లు ఈ విషయమై ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని అడిగారు. శాసనసభ సమావేశాలలో ఈ విషయం తాను అడిగితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పదని, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాట్లాడదని, అలాంటపుడు తెలంగాణ రైతుల పట్ల వారికున్న ప్రేమ ఏమిటని ఆయన అన్నారు.
http://www.teluguone.com/news/content/harish-rao-24-10846.html





