మిస్టరీ వీడిన 'గాలి'కేసు..అంతా శ్రీలక్ష్మి మహిమే !
Publish Date:Jan 10, 2012
Advertisement
హైదరాబాద్: మిస్టరీ వీడిపోయింది. 'గాలి' గనుల దందాలో అత్యంత కీలకమైన 'క్యాప్టివ్' పదం ఎలా ఎగిరిపోయిందో తెలిసిపోయింది. ఇదంతా సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి మహిమే అని దాదాపుగా స్పష్టమైపోయింది. నాటి ప్రభుత్వ పెద్దల మాటలకు ఎస్ అంటూ తల ఊపిన ఆమె కేంద్రం కళ్లకు గంతలు కట్టినట్లు సీబీఐ సేకరించిన ఆధారాల ద్వారా రుజువవుతోంది. 'కడపలో ఉక్కు కర్మాగారం పెడుతున్నారు. కరువు సీమలో సిరులు కురిపిస్తారు. వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అందుకే, ఇనుప ఖనిజం గనులు కేటాయిస్తున్నాం' అంటూ ఓబుళాపురం కంపెనీని భుజానికెత్తుకున్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్, గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 'గాలి' జపం చేశారు.కాగా అనంతపురం జిల్లా సిద్ధాపురం, మలపనగుడి గ్రామాల పరిధిలోని 68.5 హెక్టార్ల గనిని ఓఎంసీకి కట్టబెట్టడానికి 'క్యాప్టివ్ మైనింగ్'నే ప్రధాన కారణంగా చూపించారు. నోట్ ఫైళ్లలో భద్రంగా ఉన్న ఈ కీలకమైన పదం జీవోల జారీదాకా వచ్చేసరికి అదృశ్యమైంది. దీనికి కారణం 'మీరంటే మీరు' అని రాష్ట్ర, కేంద్ర స్థాయి అధికారులు వేలెత్తి చూపుకుంటున్నారు. మొత్తం అక్రమ మైనింగ్‌లో అత్యంత కీలకమైన 'క్యాప్టివ్' అదృశ్యం గుట్టును సీబీఐ రట్టు చేసింది. ఇదంతా శ్రీలక్ష్మి మహిమే అని తేల్చారు.
'మేజర్ మినరల్స్'కు సంబంధించిన దరఖాస్తులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే ప్రాసెస్ చేస్తుంది. అంతిమంగా అనుమతి మాత్రం కేంద్ర గనుల శాఖ మంజూరు చేస్తుంది. ఈ క్రమంలో కేంద్రం వ్యక్తం చేసే సందేహాలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చాల్సి ఉంటుంది. వివరణలూ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయమే కీలకం. అయితే బ్రహ్మణి స్టీల్స్ అవసరాల కోసమే ఓఎంసీకి 68.5 హెక్టార్ల గనులు కేటాయిస్తున్నట్లు 2007 జనవరి 18న కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లోకానీ, అదే సంవత్సరం ఏప్రిల్ 21న పంపిన వివరణల్లోకానీ శ్రీలక్ష్మి ప్రస్తావించలేదు. తొలుత పంపిన లేఖలో ఓఎంసీకి 68.50 హెక్టార్లను 20 సంవత్సరాలపాటు కేటాయించాల్సిందిగా కోరారు. ఇవే గనుల కోసం ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏపీఎండీసీతో సహా సుమారు 30 మంది దరఖాస్తు చేసుకోగా అందులోంచి ఓఎంసీని మాత్రమే ఎంపిక చేశారు. మిగిలిన వారు గనులను నోటిఫై చేయకముందే దరఖాస్తు చేసుకున్నారంటూ తోసిపుచ్చారు. ఇలా 'తోసిపుచ్చడానికే' పలు సాకులు చూపించారు. అంతేతప్ప క్యాప్టివ్ మైనింగ్ నిమిత్తం గనులు కేటాయిస్తున్నందునే ఓఎంసీకి ప్రాధాన్యం ఇస్తున్న సంగతి మాత్రం శ్రీలక్ష్మి చెప్పలేదు. "మిగిలిన దరఖాస్తుదారులందరికంటే ఓఎంసీయే అత్యంత ఉత్తమమైనది. పైగా ఆ సంస్థ అటవీశాఖ అనుమతులు కూడా తెచ్చుకుంది'' అంటూ ఓఎంసీ గుణగణాలను కీర్తించడానికి మాత్రమే ఈ లేఖను పరిమితం చేశారు.
ఓఎంసీకి మాత్రమే ఎందుకు ఇవ్వాలి? అని ఎవరైనా ప్రశ్నిస్తే అన్నింటికంటే ముందుగా చెప్పాల్సిన విషయం 'క్యాప్టివ్ మైనింగ్ కనుకే ఇస్తున్నాం' అని బల్ల గుద్ది వాదించాలి. కానీ శ్రీలక్ష్మి ఈ ఒక్క విషయం తప్ప అన్ని వివరాలు ప్రస్తావించారు. మిగిలిన దరఖాస్తుదారులకు కూడా మరో అవకాశం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఏమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా ఓఎంసీకి అనుకూలంగా ఓటు వేశారు. ఒక దశలో కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ తర్వాత పెద్దల ఒత్తిళ్లతో పని సాఫీగా సాగిపోయింది. 2007 మే 25న ఓఎంసీకి 68.50 హెక్టార్ల మైనింగ్ లీజు కేటాయిస్తున్నట్లుగా కేంద్రం లేఖ పంపింది. తెరవెనుక ఇదంతా జరుగుతున్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం ఖనిజ సంపదకు విలువ జోడించేందుకు ఓఎంసీ ముందుకొచ్చిందని అందుకే ఈ దరఖాస్తుకు ప్రాధాన్యం ఇచ్చామని చెబుతూ వచ్చారు.
http://www.teluguone.com/news/content/gali-janardan-rteddy-24-10845.html





