మాకినేని మౌనం... కార్యకర్తల్లో గందరగోళం
Publish Date:Feb 14, 2012
Advertisement
గుంటూరు: గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య తన రాజకీయ భవిష్యత్తుపై మౌనం దాల్చడంతో ఆయనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం ఆయన వైయస్సార్ కాంగ్రెస్ లొ సెంట్రల్ గవర్నింగ్ కమిటి సభ్యుడుగా ఉన్నప్పటికీ అ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందారు. మంత్రిగా కూడా పదవిని అధిష్టించారు. అయితే పార్టీ నేతల వైఖరితో విసుగు చెందిన ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాని అక్కడ కూడా ఆయన ఇమడలేక అ పార్టీకి దూరంగా వుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయనను తిరిగి తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాలన్న ఆలోచనతో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ఆయన అనుచరులు, అభిమానులు రంగంలోకి దిగారు. పెదనందిపాడు, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాలకు చెందిన టిడిపి కార్యకర్తలు, నాయకులు రత్తయ్య నివాసానికి వెళ్ళి తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావలసిందిగా గట్టిగా పట్టుబట్టారు. అయితే వీరు ఎంతగా వత్తిడి తెచ్చినప్పటికీ మాకినేని మౌనంగా ఉండటం నాయకులు, కార్యకర్తలకు ఆందోళన కలిగించింది. మాకినేని పెదరత్తయ్య తెలుగుదేశం పార్టీకి దూరమై జగన్ పక్షాన చేరినా అనుచరగణం మాత్రం టిడిపినేఅంటిపెట్టుకుని ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ లో కొన్నాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించిన రత్తయ్య క్రమేణా అక్కడ ఎదురైన పరిస్థితుల మూలంగా అవమానాలకు గురయ్యారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ ను రత్తయ్య కోరినా ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం అనవసరమని భావించిన రత్తయ్య కొంతకాలంగా మౌనముద్ర వహించారు. రత్తయ్య టిడిపిలో చేరిక అంశం ఆయన అంగీకారంతో పాటు పార్టీ అధినేత చంద్రబాబు ఆమోదంపై కూడా ఆధారపడి ఉంది. అంతేకాకుండా గుంటూరు జిల్లా పార్టీకి చెందిన ముఖ్యనేతల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
http://www.teluguone.com/news/content/guntur-24-11903.html





