ఉపపోరుకు మహబూబ్ నగర్ రె'ఢీ'
Publish Date:Feb 14, 2012
Advertisement
మహబూబ్ నగర్: రాష్ట్రంలో 7 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యధికంగా మూడు సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.ఈ పరిస్థితుల్లో బరిలో నిలిచే అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం టిడిపి, టిఆర్ఎస్ ఈ సీట్లను గెలుపొందాలనే లక్ష్యంతో ఉన్నాయి.
టిఆర్ఎస్ తరపున జిల్లా కేంద్రం నుంచి ఎం.పి.గా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ జిల్లాలో ఆ పార్టీ ఖాతాలో ఒక్క సీటు కూడా లేదు.ఈ ఉప ఎన్నికల్లో తన ఉనికిని చాటుకొనేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నాగర్ కర్నూల్ లో టిడిపి మాజీ నేత నాగం జనార్ధన్ రెడ్డికి మద్దతు ప్రకటించింది. కొల్లాపూర్, మహబూబ్ నగర్ స్థానాలపై ఆ పార్టీ కన్నేసింది. ఈ నేపధ్యంలో మూడు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లుగా ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా నియమించింది. కొల్లాపూర్ కు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు, మహబూబ్ నగర్ కు టిఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, నాగర్ కర్నూలుకు భాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలను ఇన్ చార్జులుగా నియమించింది.
ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే మండలానికో మంత్రిని రంగంలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం మూడు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను మంత్రి డి.కె.అరుణ నిర్దేసిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉప ఎన్నికలు జరిగే ఈ నియోజకవర్గాల్లో ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులను మంజూరు చేయించే పనిలో ఉన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పధకం మొదటి దశ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో త్వరలోనే ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు సిద్దమవుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాతే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లు జిల్లా ముఖ్యనేత ఒకరు తెలిపారు.
ఈ ఉపఎన్నికల్లో ఉనికికోసం పోరాడుతున్న టిడిపి ఇప్పటికే మూడు నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఎంపిక చేసింది.జిల్లాలో ఇప్పటికే ఆ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో వారిని ఆయా నియోజకవర్గాలకు సమన్వయ కర్తలుగా నియమిస్తూ ఇతర తెలంగాణా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాలకు, మండలాలకు ఇన్ చార్జు లుగా నియమించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన టిడిపి అధినేత చంద్రబాబు ఏంచేసైనా సరే నాగంను ఓడించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పాలమూరు జిల్లాలో పార్టీకి కొంత అనుకూల వాతావరణం ఉందని తెలంగాణా వాదం ఒకటి ఇక్కడ ప్రధానసమస్య అని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయన కుల రాజకీయాలను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మూడు నియోజకవర్గాల్లో బీసీలు అధికంగా ఉండటంతో ఆ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను ఈ నియోజకవర్గాల్లో మోహరించాలని యోచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/by-elections-24-11906.html





