టాలీవుడ్.. రేవంత్ సర్కార్ మధ్య గ్యాప్ తగ్గినట్లేనా?
Publish Date:Jan 1, 2025
Advertisement
సినీ పరిశ్రమ వర్సెస్ రేవంత్ సర్కార్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయిందా? అన్న ప్రశ్నకు ఔనన్న సమాధానమే వస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వేసిన అడుగులతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచే బీఆర్ఎస్ తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాన్ని ఎగదోసి రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్న విమర్శలు సినీ పరిశ్రమ నుంచే వస్తున్నాయి. ఇంత కాలం సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటన, తదననంతర పరిణామాలు అంటే.. అల్లు అర్జున్ అరెస్టు, కొత్త సినిమాలకు ప్రీమియర్ షోలు, టికెట్ల ధరల పెంపునకు అనుమతి నిరాకరణ వంటి సంఘటనలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిగా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కేటీఆర్ అయితే రేవంత్ టార్గెట్ గా ఈ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమకు ఒకింత ఇబ్బందికరంగా మారాయి. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం పూర్తి సుహృద్భావ వాతావ రణంలో జరిగిందని స్పష్టం చేసిన దిల్ రాజు.. అనవసర వివాదాల్లోకి సినీ పరశ్రమను లాడగం మంచిది కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పరిశ్రమను అడ్డం పెట్టుకోవద్దని ఒకింత ఘాటుగానే చెప్పారు. దిల్ రాజు ప్రకటన తరువాత సినీ పరిశ్రమలో ఒకింద ధీమా వ్యక్తం అవుతోంది. దిల్ రాజు వినా మిగిలిన సినీ ప్రముఖులెవరూ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించలేదు. అలాగే దిల్ రాజు ప్రకటనను స్వాగతిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయారు. దీనిని బట్టే కేటీఆర్ వ్యాఖ్యలకు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లేదన్న విషయం తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా సీఎం రేవంత్ తో భేటీ సందర్భంగా ఆ భేటీకి హాజరైన సినీ ప్రముఖులంతా పోటీలు పడి రేవంత్ పై ప్రశంసలు కురిపించడమే బీఆర్ఎస్, కేటీఆర్ అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని చాటినట్లైందని అంటున్నారు. ఇక అన్నిటి కంటే ప్రముఖంగా చెప్పుకోవలసినదేమిటంటే.. కేటీఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్ తో సినీ పరిశ్రమకు, రేవంత్ సర్కార్ కు ఉన్న గ్యాప్ తగ్గిపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే సినీపరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా సమస్యల పరిష్కారినికి ఒక వేదికను ఏర్పాటు చేసే బాధ్యతను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు తీసుకున్నట్లైంది. ఇటు ప్రభుత్వం తరఫునా, అటు సినీ పరిశ్రమ తరఫునా కూడా తన వాయిస్ ను వినిపించడానికి ఆయన ఎటువంటి భేషజాలూ లేకుండా ముందుకు వచ్చారు. పరిశ్రమకు కావలసినవి ప్రభుత్వం ముందు ఉంచడంతో పాటు, ప్రభుత్వం పరిశ్రమ విషయంలో ఏ చేయాలని అనుకుంటోందన్నది పరిశ్రమ పెద్దలకు స్పష్టం చేశారు. దీంతో ముందు ముందు సినీపరిశ్రమ ప్రభుత్వం మధ్య సత్సంబంధాలతో పాటు పరిశ్రమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే వాతావరణాన్ని దిల్ రాజు కల్పించారన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాలలోనే కాకుండా పరిశీలకుల నుంచి కూడా వ్యక్తం అవుతోంది.
పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మరచిపోయారనీ, ప్రముఖులకే రేవంత్ ఎవరో తెలియని పరిస్థితి ఉంటే ఇక సామాన్యులకు ఆయన ఎలా తెలుస్తారనీ కేటీఆర్ చేసి వ్యాఖ్యలు సినీ పరిశ్రమ ప్రముఖులు జీర్ణించుకోలేకపోయారు. అంతే కాకుండా సినీ ప్రముఖులతో భేటీలో రేవంత్ సూటిగానే పరిశ్రమను అడ్డు పెట్టుకుని కేటీఆర్ తనను టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలకు పరిశ్రమ పెద్దల నుంచి కౌంటర్ ఎందుకు రావడం లేదని నిలదీశారు. ఈ ప్రశ్నకు సినీ ప్రముఖల వద్ద నుంచి సమాధానం లేకుండా పోయింది.
అయితే ఆ భేటీ తరువాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీటుగా సమాధానం ఇచ్చారు. సినీ పరిశ్రమను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని కేటీఆర్ కు దిల్ రాజు చాలా స్పష్టంగా చెప్పారు.
http://www.teluguone.com/news/content/gap-reduced-between-revanth-sarkar-and-tollywood-39-190650.html