వాళ్ల ఏడుపు నాకు వినసొంపు...సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
Publish Date:Apr 28, 2026
Advertisement
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న వారిని పురాణాల్లోని రాక్షస పాత్రలతో పోల్చిన సీఎం రేవంత్, కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని కుట్రలు పన్నుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను 'శుక్రాచార్యుడు'తో, ఆ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్‌రావులను 'మారీచులు, సుబాహులు'గా అభివర్ణించారు. వీరు ప్రజల్లో తిరుగుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు ఏడుస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయిన బాధలో వారు చేస్తున్న విమర్శలు, ఏడుపులు వినడానికి తనకు చాలా వినసొంపుగా ఉన్నాయని ఆయన సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హైదరాబాద్ నగరం ఎవరి సొత్తు కాదని, గత పాలకుల నుంచి నేటి వరకు ఇది నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వం హైదరాబాద్‌కు అదనపు హంగులు అద్దుతూ, ప్రపంచంతో పోటీ పడేలా 'నాలుగో నగరం'గా 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని తీర్చిదిద్దుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ స్థాయి వసతులు అందుబాటులోకి వస్తాయని, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుతో శాంతిభద్రతలు మరింత బలోపేతం అవుతాయని సీఎం వివరించారు. ముఖ్యంగా, పెట్టుబడిదారులకు భరోసా కల్పించేలా అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసిన రేవంత్ రెడ్డి, కొత్తగా నిర్మిస్తున్న పోలీస్ కమిషనరేట్ భవన పనులను జూన్ 2వ తేదీ నాటికి, అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ భారీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు, ప్రభుత్వం ఇస్తున్న కౌంటర్లతో రానున్న రోజుల్లో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. అటు ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుంటే, ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో సమస్యలను ఎత్తిచూపుతూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/future-city-police-commissionerate-36-218501.html





