హర్మూజ్ మాదే.. ట్రంప్.!
Publish Date:Aug 18, 2026
Advertisement
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హర్మూజ్ జలసంధి అమెరికా నూతన భూభాగంగా ప్రకటించిన ట్రంప్ అందుకు సంబంధించి మ్యాప్ ను కూడా విడుదల చేశారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ వేదికగా ఇందుకు సంబంధించిన మ్యాప్‌ను ఆయన షేర్ చేశారు. ఇరాన్‌తో కుదిరిన 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం గడువు ముగిసిన మరుసటి రోజే ట్రంప్ ఈ ప్రకటన చేయడం విశేషం. హర్మూజ్ జలసంధిలో అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందని ట్రంప్ ఆ పోస్టులో విస్పష్టంగా పేర్కొన్నారు, అక్కడ సముద్ర మార్గంలో ఇరాన్ గతంలో అమర్చిన మైన్ లు అన్నింటినీ అమెరికా బలగాలు పూర్తిగా తొలగించాయని ట్రంప్ పేర్కొన్నారు. సరుకు రవాణా నౌకల రాకపోకలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయన్నారు. అయితే.. జలసంధిలో సాధారణ రవాణా పునరుద్ధరించినప్పటికీ.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికాదళ దిగ్బంధం యథావిధిగా కొనసాగుతుందనీ, ప్రస్తుతం ఇరాన్ పాలక వర్గంతో దౌత్యపరమైన చర్చలు జరగడం లేదని, సమీప భవిష్యత్తులో కూడా ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ట్రంప్ ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు. ట్రంప్ ప్రకటనపై ప్రపంచ దేశాల నుంచి, క్షేత్రస్థాయి పరిశీలకుల నుంచీ వాస్తవానికి అక్కడ పరిస్థితులు ట్రంప్ చెబుతున్నంత సరళంగా లేవని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా మంగళవారం (ఆగస్టు 18) కూడా ఆ జలసంధి మార్గంలో వెళ్తున్న ఒక భారీ క్యారియర్ నౌకపై జరిగిన దాడిలో నౌకలోని పలువురు సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడుల నేపథ్యంలో యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఏజెన్సీ ఆ మార్గంలో ప్రయాణించే సరుకు రవాణా నౌకలు, ట్యాంకర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, భద్రతా ప్రమాణాలను కఠినంగా పాటించాలని సూచించింది. ట్రంప్ ప్రకటనల కంటే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రమాదకర పరిస్థితులే ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నాయని రవాణా సంస్థలు భావిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ సోషల్ మీడియా ప్రకటనపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఉన్న జలసంధిని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని రిటార్డ్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధి అమెరికా కొత్త భూభాగంగా భావించడం పగటి కలగా పేర్కొంది. అమెరికా దిగివచ్చే వరకూ హర్మూజ్ జలసంధిని సాధారణ వాణిజ్యానికి సంపూర్ణంగా తెరవడం సాధ్యపడదని కుండబద్దలు కొట్టింది. Donald Trump, Strait of Hormuz, US Iran Tensions, Truth Social Post, Middle East Conflict
http://www.teluguone.com/news/content/donald-trump-36-229223.html





