ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా ఎర్రచందనం స్వాధీనం..!
Publish Date:Jul 16, 2026
Advertisement
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు. హాంకాంగ్‌కు అక్రమంగా ఎర్రచందనాన్ని తరలించేందుకు ప్రయత్నించిన ఓ భారతీయ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి 365.545 కిలోల ఎర్రచందనం (రెడ్ శాండర్స్) స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారంతో జూలై 13, 2026న టెర్మినల్-3లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హాంకాంగ్‌కు సీఎక్స్-698 విమానంలో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న భారతీయ ప్రయాణికుడిపై అనుమానం రావడంతో అతడిని అడ్డుకుని సామానును క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో మొత్తం 12 బ్యాగుల్లో అత్యంత చాకచక్యంగా దాచిపెట్టిన 365.545 కిలోల ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో ఆరు ట్రాలీ సూట్‌కేసులు, మరో ఆరు ట్రావెల్ బ్యాగులు ఉన్నాయి. అధికారులకు అనుమానం రాకుండా ఎర్రచందనం దుంగలను నీలిరంగు పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసి, వాటి చుట్టూ మందమైన స్పాంజ్ అమర్చి స్కానింగ్‌లో కూడా గుర్తించలేని విధంగా దాచినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఈ వ్యవహారం అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలకు సంబంధించినదై ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ఎర్రచందనాన్ని ఎక్కడి నుంచి సేకరించాడు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? హాంకాంగ్‌లో ఎవరికి అప్పగించాల్సి ఉంది? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఇతర వ్యక్తుల పాత్రపైనా విచారణ చేపట్టారు. ఈ అక్రమ ఎగుమతి ప్రయత్నం కస్టమ్స్ చట్టం–1962, సైట్స్ (CITES) కన్వెన్షన్ అపెండిక్స్-II, అలాగే విదేశీ వాణిజ్య (అభివృద్ధి, నియంత్రణ) చట్టం–1992 నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని కస్టమ్స్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యంత విలువైన వనరుగా భావించే ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సరిహద్దు ప్రాంతాల్లో కస్టమ్స్ అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. Delhi IGI Airport, Red Sanders, Red Sandalwood Smuggling, Customs Seizure, 365.545 Kg Seized, Hong Kong, Indian Passenger Arrested, Air Intelligence Unit (AIU), International Smuggling, Customs Raid
http://www.teluguone.com/news/content/delhi-igi-airport-36-226171.html





