సమన్వయంలో సీఎంను ఏకిపారేసిన డిప్యూటీ ఢిల్లీకి పిలుపు
Publish Date:Jan 7, 2012
Advertisement
హైదరాబాద్: సమన్వయ కమిటీ తొలి భేటీలోనే మోగిన 'సమర భేరీ' ఇది. కమిటీ అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్ ఎదుటే ముఖ్యమంత్రి కిరణ్‌పై డిప్యూటీ సీఎం రాజనరసింహ నిప్పులు చెరిగారు. ప్రశ్నల వర్షం కురిపించారు. అనేక అంశాలను ప్రస్తావిస్తూ, వాటిపై సీఎం వైఖరిని ప్రశ్నిస్తూ ఉతికి ఆరేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ప్రభుత్వానికీ, పార్టీకీ మధ్య సమన్వయలోపం స్పష్టంగా కన్పిస్తోందని సమావేశం మొదట్లోనే ఆజాద్ పేర్కొన్నారు. ఇది మంచిది కాదని హితవు పలికారు. దామోదర రాజనరసింహ చిరంజీవిని కూడా అడ్డుకుంటూ ఆయన ముఖ్యమంత్రిని ఉతికి ఆరేసినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి సరైన దిశ నిర్దేశించకపోవడంతో తనతో పాటు పార్టీ కార్యకర్తలంతా అయోమయంలో ఉన్నారని ఆయన విమర్శించారు. మంత్రులకు కూడా చెప్పకుండానే ముఖ్యమంత్రి పథకాలను ప్రవేశపెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల విషయంలో కూడా ముఖ్యమంత్రిని ఆయన నిలదీశారు. తాను ఒక్క సెజ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి చెప్పగా, ఇప్పటికే 23 ఆర్థిక మండళ్లకు అనుమతి ఇచ్చారని, వాటిని సమీక్షించి ఒప్పందాలు అమలవుతున్నాయా లేదా చూడాల్సిన అవసరం ఉందని దామోదర రాజనర్సింహ అన్నారు. జలయజ్ఞం వంటి పథకాలను ఎందుకు సమీక్షించడం లేదని ఆయన అడిగారు. ఎవరికీ చెప్పకుండా విద్యుత్ చార్జీలను పెంచాలనే నిర్ణయం ఎలా తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఇకపై పార్టీ, ప్రభుత్వంలో చర్చించకుండా ఏ కొత్త పథకాన్ని ప్రకటించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. పార్టీ, ప్రభుత్వం ఒక్కతాటిపై వెళ్తున్నాయన్న సంకేతాన్ని ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేసిన దామోదర రాజనర్సింహను వారంలోగా ఢిల్లీకి రావాలని ఆజాద్ ఆహ్వానించారు. వివిధ వివరాలతో తన వద్దకు రావాలని ఆయన సూచించారు. పార్టీ శానససభ్యుల్లో జగన్ వర్గానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారు, వారి నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు ఎవరెవరు ఉన్నారు, సామాజిక వర్గ సమీకరణాలు ఏమిటి అనే విషయాలతో ఢిల్లీకి రావాలని ఆయన దామోదర రాజనర్సింహకు సూచించారు.
http://www.teluguone.com/news/content/damodara-rajanarasimha-24-10715.html





