కేసీఆర్ వరి సాగు నిజమేనా? రైతులను మోసం చేస్తున్నారా?
Publish Date:Dec 27, 2021
Advertisement
వరి వేస్తే ఉరే. ఒక్క గింజ వడ్లు కూడా కొనం. రైతులెవరూ వరి పంట వేయొద్దు. వేస్తే ఇక మీ ఇష్టం. కొంతకాలంగా సీఎం కేసీఆర్ ఊదరగొడుతున్న మాటలివి. మంత్రులు సైతం ఇదే గోల. ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ.. వరి వద్దంటూ పదే పదే చెబుతోంది. కేంద్రాన్ని బూచిగా చూపి.. రైతులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. మరి, చెప్పేందుకేనా ఈ నీతులు? కేవలం బక్క రైతుల కోసమేనా ఈ సుద్దులు? బడా రైతులకు, కార్పొరేట్ తరహా వ్యవసాయదారులకు వరే ఉత్తమమా? అలాంటి వారికోసమేనా ఈ వరి-ఉరి డ్రామాలు? అంటూ విమర్శలు వస్తున్నాయి. అందుకు కారణం.. కేసీఆరే. అవును, కేసీఆర్ తీరువల్లే ఇప్పుడు వరి-ఉరి ఎపిసోడ్ తీవ్ర వివాదాస్పదమవుతోంది. రేవంత్‌రెడ్డి బయటపెట్టిన ఆ సంచలనంతో.. తెలంగాణ రైతాంగమంతా కేసీఆర్‌ను తిట్టిపోస్తోంది? ఇంతకీ ఏం జరిగిందంటే.... ఎర్రవల్లి ఫామ్‌హౌజ్. తెలుసుగా సీఎం కేసీఆర్ ఇలాఖా. అక్కడ 150 ఎకరాల సువిశాల క్షేత్రంలో కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారు. అందుకే తాను రైతునని చెప్పుకుంటారు. గతంలో కూరగాయలు పండించి.. కోట్లు ఆర్జించానని.. చూపించి సంచలనం రేపారు. మరిప్పుడు కూరగాయల సాగు లాభసాటిగా లేదో.. లేక, రైతులందరినీ వరి వేయొద్దని అంటున్నందుకు.. ఈసారి వరికి బాగా డిమాండ్ ఉంటుందని అంచనానో ఏమో.. కేసీఆర్ మాత్రం వందల ఎకరాల్లో వరి నారు వేశారు. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో 150 ఎకరాల్లో కేసీఆర్ వరి సాగు చేస్తున్నారు. ఇదిగో ఇవే ఆధారాలు... అంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫోటోలు, వీడియోలు బయటపెట్టేసరికి అసలు యవ్వారం వెలుగుచూసింది. కేసీఆర్ చెప్పిందేంటి? చేస్తున్నదేంటి? వరి వేయొద్దని మొత్తుకుంటున్న ఆయనే.. ఇలా వందలాది ఎకరాల్లో వరి సాగు చేస్తూ.. రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు? అంటున్నారు. ఒక్క ఎకరా పండించే రైతునే అదరగొట్టి.. బెదరగొట్టి.. వరికి దూరం చేస్తుంటే.. మరి, ఈయన గారేమో ఏకంగా 150 ఎకరాల్లో వరి నాట్లు వేయడమేంటని అన్నదాతలు మండిపడుతున్నారు. వరిపై రైతులను భయపెట్టి.. వరి వేయకుండా చేసి.. డిమాండ్ పెంచాలనే కుట్ర దాగుందా? తనతో పాటు తనలాంటి బడా వ్యవసాయదారులకు లాభం చేయాలనే వ్యూహమా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే, కేసీఆర్ అనుకూలవాదులు లాజికల్‌గా మాట్లాడుతూ సమర్థించుకునే ప్రయత్నాలూ చేస్తున్నారు. వరి పంటను ప్రభుత్వం కొనదని మాత్రమే చెప్పిందని.. మిల్లర్లకు అమ్ముకోగలమని అనుకునేవాళ్లు వరి వేసుకోవచ్చని కేసీఆరే చెప్పారని వాదిస్తున్నారు. ఈ వాదనపై రైతులు మండిపడుతున్నారు. అలాగైతే, సిద్ధిపేట గత కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వరి వేయొద్దని రైతులను బెదిరించడం.. జిల్లాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సహాయ నిరాకరణ చేస్తుండటం.. ఎందుకని నిలదీస్తున్నారు. రైతులను వరి సాగు వద్దంటున్న కేసీఆర్.. తాను కూడా వరి వేయకుండా వారికి ఆదర్శంగా ఉండాలి కానీ.. తాను మాత్రం వరి పంట సాగు చేస్తూ.. చిన్న రైతులను మాత్రం వరి వేయొద్దనడం దారుణమైన విషయమని అన్నదాతలంతా కేసీఆర్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
http://www.teluguone.com/news/content/controversy-over-kcrs-150-acres-paddy-crop-39-129136.html





