నిరుద్యోగంపై పోరాటం.. నిరుద్యోగులతో చెలగాటం
Publish Date:Dec 27, 2021
Advertisement
తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకులు ఎవరూ బలిదానాలు చేయలేదు. ఒకరిద్దరు ప్రయత్నించినా ఒకరికి నెత్తిన పోసుకునేందుకు పెట్రోల్ దొరికింది కానీ, అగ్గి పెట్టె దొరక లేదు.ఇంకో కాయన చావు పులి నోట్లో తల పెట్టారు కానీ, చావు పులి ఎందుకో భయపడి పారిపోయింది. ఆ విధంగా రాష్ట్రం కోసం బలిదానం చేసుకునే అవకాశం మిస్సైన, ఆ ఒకరిద్దరు రాజకీయ నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో, ఏమి చేస్తున్నారో వేరే చెప్ప నక్కర్లేదు. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసింది విద్యార్ధులు, యువకులు, మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత. నిజానికి, 1200కి పైగా యువకుల ఆత్మబలిదానాల ఫలితంగానే రాష్ట్రం సాధ్యమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ యువకుల ఆత్మహుతి దృశ్యాలను చూసి చలించి పోయారు. అందుకే, రాజకీయంగా నష్టమని తెలిసినా రాష్ట్ర విభజనకు అంగీకరించారు. అలాగే, అప్పటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్’ ను కూడ యువకుల బలిదానాలే కదిల్చాయి. ఆ కారణంగానే, బీజేపీ రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చింది. అయితే, దురదృష్ట్య వశాత్తు, రాష్ట్రం సాధించుకుని ఏడేళ్ళు పూర్తయినా, ఇంతవరకు ఆత్మ బలిదానం చేసుకున్న నిరుద్యోగ యువకుల ఆశయం నెరవేర లేదు. ఇంకా ఈ నాటికీ ఇరుద్యోగ యువత ఆత్మహత్యలు ఆగ లేదు. స్వరాష్ట్రం వచ్చినా యువతకు ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాల సంగతి తర్వాత కనీసం ఉద్యోగ నోటిఫికేషన్లకు దిక్కు లేదు. పంచాయతీ మొదలు పార్లమెంట్ వరకు, ఏ ఎన్నిక, ఉప ఎన్నిక వచ్చినా, ఇన్ని వేల ఉద్యోగాలు, అన్ని వేల ఉద్యోగాలు, ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు అధికార పార్టీ నాయకులు అందరూ, నిరుద్యోగ యువతను ఆశల పల్లకి ఎక్కిస్తూనే ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ విషయమే మరిచిపోతున్నారు.యువకులు నిరాశతో ముఖ్యమంత్రిని బాధ్యునిచేస్తూ చావు లేఖలు (సూసైడ్ లెటర్ ) రాసి మరీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయినా, ప్రభుత్వంలో చలనంలేదని విపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఇప్పటికే, నిన్నమొన్న పుట్టిన వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలా ప్రతి మంగళ వారం దీక్ష చేస్తున్నార, కాంగ్రెస్ పార్టీ, విద్యార్ధి, నిరుద్యోగ సైరన్ పేరిట ఆందోళన చేసింది. అయితే, పభుత్వంలో మాత్రం చలనం లేదని నిరుద్యోగులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. ముందు ఇందిరా పార్క్ వద్ద అనుకున్న దీక్షను పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మారింది. అయినా ప్రభుత్వం బీజేపీ నేతలను గృహ నిర్బంధంలో ఉచ్న్హి దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అదలా ..ఉంటే దీక్షపై మంత్రి కేటీఆర్ రాసిన బహిరంగ లేఖ మరో చర్చకు దారితీసింది. బీజేపీ నేతలు చేసేది నిరుద్యోగ దీక్ష కాదు, సిగ్గులేని దీక్ష అని విమర్శించారు కేటీఆర్. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏ గంగలో కలిసిందని ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో దేశానికి లెక్క చెప్పే దమ్ముందా అని సవాల్ చేశారు. బీజేపీ కపట ప్రేమను చూసి అవకాశవాదమే సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటుందన్నారు కేటీఆర్. రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ జంతర్ మంతర్ లో దీక్ష చేయాలని.. కేంద్రం పరిధిలోని 15 లక్షల ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలని సూచించారు. రాష్ట్రంలో ఏటా లక్షలాది యువతీ యువకులు డిగ్రీలతో బయటికి వస్తున్నారని అంటున్నారు కేటీఆర్. డిగ్రీ పూర్తయిన ప్రతీ ఒక్కరికి ఉద్యోగాన్ని ప్రపంచంలో ఏ దేశమూ, ఏ ప్రభుత్వమూ కల్పించలేదని చెప్పారు. అలాగని తాము కేంద్రం లాగా బాధ్యత నుంచి తప్పించుకోవడం లేదని.. తెలంగాణలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ విధానంతో రాష్ట్రానికి రూ.2 లక్షల 20 వేల కోట్ల పెట్టబుడులు తీసుకొచ్చామన్నారు. తద్వారా సుమారు 16 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించామని వివరించారు. అయితే.. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. అయితే ఎవరు అబద్ధాలు వరు చెఉపుతున్నారు .. కానీ, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలు ఆగడం లేదని. యువత ఆవేదన వ్యక్త పరుస్తున్నారు. ఒక విధంగా చూస్తే నిరుద్యోగంఫై పోరాటం పేరిట రాజకీయ పార్టీలు నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. అదీ అసలు విషాదం.
http://www.teluguone.com/news/content/telangana-politics-on-un-employement-issues-39-129139.html





