కిరణ్ వర్శస్ బొత్స? ఆందోళనలో పార్టీ
Publish Date:Dec 16, 2011
Advertisement
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విభేదాలు తారాస్థాయికి చేరాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది.కిరణ్ సిఎం అయ్యాక మంత్రివర్గ విస్తరణ సమయంలో ప్రారంభమైన విభేదాలు తాజాగా ముదిరి పాకాన పడినట్లుగా తెలుస్తోంది.కిరణ్ ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు బొత్సపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన బొత్స కూడా సిఎంకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నట్లుగా సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల ఉన్న నేపథ్యంలో వీరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అధిష్టానాన్ని, పార్టీ క్యాడర్ను కలవరపరుస్తోందట.
ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానం సమయంలో వారి మధ్య మరింత దూరం పెరిగిందట. అవిశ్వాసానికి ముందు చిరంజీవి వర్గం అలక వెనుక బొత్స ఉన్నారనే అనుమానం కిరణ్లో ఉందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలతో కిరణ్ సఖ్యత పెంచుకునే ప్రయత్నం చేయగా, బొత్స మాత్రం ఎమ్మెల్యేలు కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి రావాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో వారు వెనక్కి తగ్గారనే వాదనలు ఉన్నాయి. మరోవైపు సిఎం మంత్రివర్గ విస్తరణ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగా బొత్స పిఆర్పీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట.
ఇలా మంత్రివర్గ విస్తరణ సమయంలో ప్రారంభమైన బొత్స - కిరణ్ విభేదాలు అవిశ్వాసం సమయానికి తారాస్థాయికి చేరాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో పిసిసి చీఫ్, సిఎం మధ్య ఇలాగే విభేదాలు ఉంటే పార్టీకి నష్టం కలిగిస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/cm-kiran-24-9917.html





