కేసీఆర్ సర్వేలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదట?
Publish Date:Jun 1, 2017
Advertisement
సర్వే ఎవరి చేత చేయించారు? శాంపిల్ గా ఎంత మందిని తీసుకున్నారు? ఈ ప్రశ్నలు వేస్తోంది...ఏ విపక్ష ఎమ్మెల్యేనో... ప్రత్యర్ధులో కాదు... స్వయంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే కేసీఆర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకేంటే...కేసీఆర్ సర్వే ఫలితాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. 119 సీట్లకు గానూ 111 సీట్లు రావడమేంటని... ఇది అతిశయోక్తి కాకపోతే మరేంటని అంటున్నారు. చాలా మంది టీఆర్ఎస్ MLA లు కేసీఆర్ సర్వేల తీరును తప్పుబడుతున్నారు. అసలు సర్వేలు ప్రమాణికం కాదంటున్నారు. 2004 ఎన్నికల ముందు అప్పటి సీఎం చంద్రబాబు కూడా సర్వేలను అతిగా నమ్మి మోసపోయారని గుర్తుచేస్తున్నారు. గతంలో చంద్రబాబు సొంత మనుషులతో సర్వేలు చేయించుకుని టీడీపీదే గెలుపనే నమ్మకంతో ముందస్తు ఎన్నికలకెళ్లి బొక్కబోర్లా పడ్డారని ఉదహరిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా సర్వేల శాస్త్రీయత గురించి పట్టించుకోకుండా... వాటినే నమ్ముతున్నారని పెదవి విరుస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ సర్వేపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రెండు నెలల క్రితం చేయించిన రెండో సర్వేలో టీఆర్ఎస్ కు 106 సీట్లు వస్తాయని తేలగా.. తాజా సర్వేలో 111 స్థానాలు వస్తాయని తేల్చారు. అంటే మూడో సర్వేలో గతం కంటే ఐదు సీట్లు ఎక్కువ వచ్చాయి. నిజానికి ఈ కొద్దికాలంలోనే ప్రభుత్వంపై అనేక వర్గాల్లో వ్యతిరేకత ఏర్పడింది. మిర్చి గిట్టుబాటు ధర లేకపోవడం, రైతులకు బేడీలు వేసిన ఘటన, ధర్నా చౌక్ గొడవ, నిరుద్యోగ ధర్నాలతో రాష్టం అట్టుడికింది. అలాంటప్పుడు సీట్లు తగ్గాల్సి ఉండగా...ఎలా ఎక్కువ వస్తాయని టీఆర్‌ఎస్ నేతలే ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కు కేవలం రెండు సీట్లే రావడమేంటని అంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సిట్టింగులు ఆ పార్టీకి గడ్డు పరిస్థితులున్న రోజుల్లో కూడా ఓడిపోలేదని... అలాంటిది ఇప్పుడెలా ఓడిపోతారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి హమీలు సరిగా అమలు కాకపోవడంతో... తామే నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇక తన పనితీరుపై తన నియోజకవర్గంలో సమాచారం సేకరించినట్లుగా ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదని నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ MLA అంటున్నారు. కేసీఆర్ చెప్పిన లెక్కలు ఇంటలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారంలా ఉందని అంటున్నారు. అతి విశ్వాసానికి పోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ఆందోళన చెందుతున్నారు. ఎలాగూ గెలుస్తాం కదా అని అస్త్ర సన్యాసం చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు...MIM సీట్లలో మరో పార్టీ గెలవడం ఎలాగూ అసాధ్యం. కాబట్టి కాంగ్రెస్ గెలిచే రెండు సీట్ల కోసం..రాబోయే రెండేళ్ళపాటు కష్టపడాలా అన్న భావన పార్టీ కాడర్ లో వస్తే..సెల్ఫ్ గోల్ కావడం ఖాయమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. విపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే కేసీఆర్ సర్వేల పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారని...అయితే అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/cm-kcr-45-75248.html





