140 ఏళ్ల ప్రస్థానం.. కాంగ్రెస్ లో జోషెదీ.. కార్యకర్తల్లో ఉత్సాహమెక్కడ?
Publish Date:Dec 29, 2025
Advertisement
దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని కూడా అంటారు. స్వాతంత్యోద్యమ కాలం నుంచీ ఉన్న ఈ పార్టీ ఈ క్రమంలో అనేక విజయాలు, అపజ యాలను చవి చూసింది. అయితే ఇప్పటి వరకూ దేశంలో అత్యధిక కాలం అధికారంలో కొనసాగిన పార్టీగా రికార్డు కూడా సృష్టించింది. అయితే గత కొన్నేళ్ల నుంచీ, అంటే దాదాపుగా దశాబ్ద కాలం నుంచీ ఆ పార్టీ వరుస పరాజయాలతో కూనారిల్లుతోంది. కాంగ్రెస్ చరిత్రలో ఇంతటి పతనావస్థ ఆ పార్టీకి గతంలో ఎన్నడూ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా 2014 సార్వత్రిక ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని ఘోర పరాజయం తరువాత నుంచి ఈ పార్టీ కోలుకోలేదనే చెప్పాలి. ఈ పరిస్థితి చాలదన్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. కీలక రాష్ట్రాలలో కనీస స్థానాలను కైవసం చేసుకోవడంలో విఫలమౌతున్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం కష్ట సాధ్యమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది. ఇవన్నీ పక్కన పెడితే.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తన 140వ ఆవిర్బావ దినోత్సవాన్ని ఆదివారం (డిసెంబర్ 28) జరుపుకుంది. అయితే 140 ఏళ్ల కాంగ్రెస్ లో ఆ సందర్బంగా ఎలాంటి ఉత్తేజం కానీ, జోష్ కానీ కనిపించలేదు. వరుస పరాజయాలతో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులు ఈ ఉత్సవాల పట్ల ఉదాశీనంగా ఉన్నాయి. వీటన్నిటికీ మించి పార్టీలో కీలక నేతలు బీజేపీ, ఆ పార్టీ మెంటార్ గా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ అనుకూల ప్రకటనలు చేస్తుండటం పార్టీ శ్రేణులను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆదివారం (డిసెంబర్ 28) పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వినా మరెక్కడా వేడుకలు జరగలేదు. పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణల్లో కూడా ఆ సందడి కనిపించలేదు. కనీసం ఆయా రాష్ట్రాలలోని కాంగ్రెస్ కార్యాలయాలలో కూడా ఎటువంటి కార్యక్రమాలూ జరిగిన దాఖలాలు లేవు. ఇక పార్టీ ఎంపీ శశిథరూర్ వంటి వారు బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం పార్టీ అధిష్ఠానాన్ని మరింత ఇరుకున పెడుతోంది. అలా పార్టీ ధిక్కార స్వరం వినిపిస్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో కాంగ్రెస్ కోలకుంటుందన్న భావన నెమ్మదిగా పార్టీ శ్రేణులలోనే అడుగంటుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పార్టీ వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నాయకుల జాబితాలోకి తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ చేరడం పార్టీ పరిస్థితిని మరింత దయనీయంగా మార్చేసింది. దిగ్విజయ్ సింగ్ తాజాగా ప్రధాని మోడీపై ప్రశంసిస్తూ కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ లను ప్రస్తుతించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో దిగ్విజయ్ సింగ్.. ప్రధాని మోడీ ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధానిగా ఎదగడానికి ఆర్ఎస్ఎస్ కు ఉన్న సంస్థాగత బలమే కారణమని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా తన పోస్టును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కీలక నేతలు ప్రియాంక వధేరా గాంధీ, రాహుల్ గాంధీలకు ట్యాగ్ చేశారు. అయితే ఆ తరువాత తన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలాన్ని చెప్పడానికే కానీ, ఆ సంస్థను కానీ, మోడీని కానీ ప్రశంసించడానికి కాదనీ కాంగ్రెస్ కు కూడా ఇలాంటి బలమైన వ్యవస్థ, అధికార వికేంద్రీకరణ అవసరమని చెప్పడమే తన ఉద్దేశం వివరణ ఇచ్చారు. ఆ వివరణలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనపడిందనీ, అధికారం కేంద్రీకృతమై ఉందన్న సంకేతాలు ఉండటం గమనార్హం. దీంతో పార్టీలోని సీనియర్లు ఒక్కరొక్కరుగా పార్టీకి దూరమౌతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ గ్రాండ్ ఒల్డ్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారౌతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/congress-fraph-falling-45-211704.html




