నా ఆప్తుడు, నటసింహం బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
Publish Date:Jun 10, 2026
Advertisement
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినం నేడు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా .. సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణకు ఆయన అల్లుడు నారా లోకేష్, కుమార్తె నారా బ్రహ్మణి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు నారా లోకేష్ సామాజిక మాధ్యమ వేదికగా.. నిండైన తెలుగుదనం, అభిమానం, భోళాతనానికి ప్రతిరూపం బాలా మావయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. హిందూపురం ప్రజా విజేత అయిన బాలకృష్ణ ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్ ఆకాంక్షించారు. ఇక ఆయన కుమార్తె నారా బ్రహ్మణి తన తండ్రిని తన సూపర్ హీరోగా అభివర్ణిస్తూ భావోద్వేగ పోస్ట్ చేశారు. తనకు అండగా, గురువుగా, గొప్ప స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు, మీ కుమార్తెగా పుట్టడం నా అదృష్టం అని పేర్కొన్నారు. బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-birthday-wishes-to-balakrishna-36-222452.html





