బాబోయ్ వీళ్ళేం మనుషులు బాబు!
Publish Date:Mar 20, 2012
Advertisement
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రముఖ సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్ బాబు మధ్య ఒకానొక దశలో పచ్చగడ్డివేస్తే భగ్గుమనేది. మోహన్ బాబు చంద్రబాబుపై కట్టిగట్టి కాలికి బలపం కట్టుకుని చిత్తూరుజిల్లా అంతా తిరిగి టిడిపికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. చంద్రబాబు అనుయాయులు మోహన్ బాబుపై అనేకమైన ఆరోపణలు చేశారు. అటువంటి వీరిద్దరి మధ్య ఇప్పుడు సయోధ్య కుదరడం చేతులు కలపడం చిత్తూరు జిల్లా ప్రజానీకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీళ్ళేనా గతంలో బద్ధశత్రువులుగా మెలిగింది అన్న ఆశ్చర్యాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు, మోహన్ బాబు మధ్య గతంలో వ్యాపార లావాదేవీలు ఉండేవి. హెరిటేజ్ డైరీలు ఏర్పాటుకు మోహన్ బాబు కూడా పెట్టుబడులు పెట్టారు. అయితే ఆ తరువాత మోహన్ బాబును తెలివిగా చంద్రబాబునాయుడు వ్యాపార భాగస్వామిగా వదిలించుకున్నారు. అప్పట్లో కొంత డబ్బు చెల్లింపు విషయంలో కూడా చంద్రబాబునాయుడు ఆలస్యం చేయడంతో మోహన్ బాబు ఆయనకు దూరమయ్యారు. అంతేకాక ఎన్నికల సమయంలో పనికట్టుకుని మరీ చంద్రబాబుకు వ్యతిరేకంగా గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రచారం చేశారు. మోహన్ బాబు ప్రచారం వల్ల చంద్రబాబుకు పెద్దగా నష్టం జరగలేదు. అయితే వీరిద్దరి మధ్య మాత్రం అగాధం మరింత పెరిగింది. కాలక్రమెణా ఇద్దరిలోనూ వచ్చిన మార్పు కారణంగా ఇప్పుడు ఇద్దరూ చేతులు కలుపుతున్నారు. కానీ గతాన్ని మర్చిపోలేని చిత్తూరుజిల్లా ప్రజలు మాత్రం 'బాబోయ్ వీళ్ళేం మనుషులు బాబు, తిట్టుకుంటారు ... కొట్టుకుంటారు ... మళ్ళీ కలిసిపోతారు' అని వ్యాఖ్యానించుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/cine-actor-mohan-babu-24-12788.html





