ఏపీ పరిషత్ ఎన్నికలు: కూటమి టార్గెట్ 94 పర్సంట్ స్ట్రైక్ రేట్.. దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.!
Publish Date:Nov 5, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మించిపోయేలా 94 శాతం స్ట్రైక్ రేట్ దాటాలన్న టార్గెట్ నిర్దేశించారు. తెలుగుదేశం కూటమి పార్టీల ముఖ్య నేతలు, అభ్యర్థులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ఈ మేరకు టార్గెట్ ఇచ్చారు. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు ఇప్పటికే పట్టం కట్టారన్న ఆయన, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించి కూటమి అభ్యర్థులకు ఓటు వేసేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. స్థానిక స్థాయిలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు, విబేధాలు ఏవైనా ఉంటే వాటిని పక్కనపెట్టాలని నేతలకు చంద్రబాబు హితవు పలికారు. ప్రతీ నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేసి కూటమి అభ్యర్థుల విజయం కోసం శ్రమించాలని కోరారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కూటమి సాధించిన 94 శాతం సక్సెస్ రేట్‌ను ప్రస్తావిస్తూ.. అదే స్ఫూర్తిని పరిషత్ ఎన్నికల్లోనూ ప్రదర్శించి క్షేత్రస్థాయిలో పూర్తి ఆధిపత్యం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ నేత పీవీఎన్ మాధవ్‌తో పాటు పలువురు కూటమి ప్రధాన నాయకులు పాల్గొన్నారు.
[Chandrababu Naidu Parishad Elections Target, AP Local Body Elections, Strike Rate 94 Percent, MPTC ZPTC Elections, TDP Janasena BJP Alliance, Telugu One]
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-parishad-elections-target-43-236376.html





