స్వగ్రామానికి చంద్రబాబు
Publish Date:Jan 12, 2012
Advertisement
చిత్తూరుజిల్లా చంద్రగిరి :పండగ కళ పల్లెల్లోనే చూడాలి, ఈసారి అలాంటి అనుభూతి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యుల సొంతం కానుంది. ఎందుకంటే ఆయన సకుటుంబంగా స్వగ్రామం నారావారిపల్లెలో సందడి చేయనుంది.
మూడేళ్లతర్వాత మళ్లీ స్వగ్రామం చేరుకోనున్నారు.
చంద్రబాబుకు రేణిగుంట విమానాశ్రయం వద్ద ఘనంగా స్వాగతం పలికి స్కూటర్లతో ర్యాలీగా గ్రామానికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వాహనాల పార్కింగ్ కోసం కందులవారి పల్లి సమీపంలో నాలుగెకరాలు కేటాయించారు. ఎన్టీఆర్ ట్రస్టు నిధులతో నారావారి పల్లెలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత తల్లిదండ్రులు ఖర్జూరనాయు డు, అమ్మణ్నమ్మ సమాధుల వద్ద కుటుంబసభ్యులతో కలిసి పూజచేస్తారు.బాలకృష్ణ కుటుంబీకులు కొందరు, బాబు సోదరుడు రామ్మూర్తి ఫ్యామిలీ కూడా రానుండటంతో ఊళ్లో బంధుమిత్రుల సందడి మొదలైంది. వారికి స్వాగతం పలుకుతూ రేణిగుంట విమానాశ్రయం నుంచి నారావారిపల్లె వరకూ పెద్దపెద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలుఏర్పాటు చేశారు. పసుపు జెండాలు, తోరణాలతో దారులన్నీ పసుపు రంగు పులుముకున్నాయి.
అక్కడ బహిరంగ సమావేశంలో మాట్లాడాక చంద్రగిరి నియోజకవర్గం, చిత్తూరుజిల్లా టీడీపీ ముఖ్యనాయకులతో భేటీ అవుతారు. చాలాకాలం తర్వాత స్వగ్రామానికి వస్తున్న చంద్రబాబును కలిసి మాట్లాడాలని ఆయన పాత స్నేహితులు ఎదురుచూస్తున్నారు. రామ్మూర్తి కుమారుడు గిరీష్ నాలుగురోజులు గా గ్రామంలో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నేడు ఉదయం అందరికీ గ్రామంలోనే అల్పాహార విందు ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నాయి. నేటి రాత్రికి బాబు తిరుమల చేరుకుని అక్కడే బసచేసి, ఉదయాన్నే శ్రీవారి దర్శనం చేసుకుని హైదరాబాద్ బయల్దేరతారు.
అలాగే సినీ హీరో నందమూరి బాలకృష్ణ గల్ఫ్‌లోని ఒమన్‌లో 3 రోజులు పర్యటిస్తారు. 14 నుంచి మస్కట్‌లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. ఆయనను కువైట్‌కు ఆహ్వానించడానికీ ప్రయత్నిస్తున్నారు. నందమూరి బసవతారకం మెమోరియల్ ట్రస్టుకు నిధుల సేకరణలో భాగంగా బాలయ్య గల్ఫ్ పర్యటనకు వస్తున్నట్లు సమాచారం.
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-24-10919.html





