ఏఐ టెక్నాలజీతో అమెరికా రక్షణ వ్యవస్థకు సవాలు.. చైనా యుద్ధవ్యూహాలు
Publish Date:Apr 5, 2026
Advertisement
యుద్ధ వ్యూహాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యంత కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ తంత్రాలలో కూడా ఏఐ ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. ఈ విషయంలో చైనా రెండడుగులు ముందే ఉంది. అమెరికా సైనిక బలగాల కదలికలు, వారి మోహరింపులను పసిగట్టేందుకు చైనా ఏఐని సాధనం మలుచుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అమెరికా మిలిటరీ రహస్యాలను ఛేదించేందుకు చైనా ఏఐని వినియోగిస్తోంది. చైనాకు చెందిన పలు సాంకేతిక సంస్థలు శాటిలైట్ ఛాయాచిత్రాలు, విమానాల రాకపోకల డేటా, షిప్పింగ్ సమాచారాన్ని విశ్లేషించడానికి ఏఐని వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా మిజార్విజన్ వంటి సంస్థలు ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ (ఓఎస్ఐఎన్టి) ద్వారా సేకరించిన సమాచారాన్ని అత్యంత వేగంగా క్రోడీకరించి, అమెరికా సైన్యం ఎక్కడెక్కడ మోహరించి ఉందో ఇట్టే కనిపెట్టేస్తున్నాయి. ఈ డేటా విశ్లేషణ ద్వారా అమెరికా అత్యంత రహస్యంగా భావించే ఆపరేషన్లను కూడాచైనా పసిగట్టగలుగుతోంది. చైనా ప్రభుత్వం చేపట్టిన మిలిటరీ-సివిల్ ఫ్యూజన్ విధానం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. పౌర అవసరాల కోసం పనిచేసే సంస్థలను కూడా చైనా సైనిక ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. ఈ క్రమంలోనే చైనా కంపెనీలు ఏఐ సహాయంతో అమెరికా రక్షణ కవచాలను ఛేదిస్తున్నాయి. దీనివల్ల ఇకపై యుద్ధరంగంలో ఏదీ రహస్యం కాదని, స్టీల్త్ టెక్నాలజీకి కాలం చెల్లిందని చైనా సంస్థలు సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుతున్నాయి. ఈ పరిణామాలు అమెరికా భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అండతో నడిచే ఈ సంస్థలు తమ సైనికులకు ప్రత్యక్ష ముప్పుగా మారాయని అమెరికా హౌస్ సెలెక్ట్ కమిటీ పేర్కొంది. గతంలో ఈ ఏఐ నిఘా ద్వారా చైనా గుర్తించిన కొన్ని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. టెక్నాలజీ సాయంతో అమెరికా రక్షణ వ్యవస్థలోని లొసుగులను చైనా బహిర్గతం చేస్తోంది. ప్రత్యక్ష యుద్ధానికి దిగకుండానే అగ్రరాజ్యం అమెరికాను వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు ఏఐని చైనా ఒక శక్తివంతమైన నిఘా సాధనంగా మార్చుకుంది. రాబోయే రోజుల్లో ఏఐ యుద్ధతంత్రం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు కారణమయ్యేలా కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/challenge-to-us-defense-system-via-ai-36-216732.html





