వైసీపీలో సుజనా మంటలు... జగన్ కంగారెందుకు పడుతున్నారు?
Publish Date:Nov 23, 2019
Advertisement
50శాతం ఓట్లు... 22మంది ఎంపీలు... 151మంది ఎమ్మెల్యేలతో కనీవినీ ఎరుగనిరీతిలో తిరుగులేని విజయం సాధించి... అధికారంలోకి వచ్చిన వైసీపీ... విపక్ష నేతలు చేస్తోన్న ప్రతీ చిన్న విమర్శకూ ఉలిక్కిపడుతోంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేకపోయినాసరే... ప్రతిపక్షాల పదునైన మాటలకు అల్లకల్లోలమవుతోంది. ఇసుక, ఇంగ్లీష్ మీడియం, మతం, ఫిరాయింపులు... ఇలా చిన్న ప్రతి విషయంలోనూ వైసీపీ కంగారుపడుతోంది. ఇక, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో అలజడి సృష్టించాయి. పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.... అలాగే, 20మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ సుజనా చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం అస్సలు పట్టించుకోకపోగా, వైసీపీ మాత్రం తీవ్రంగా స్పందించింది. వైసీపీ ఎంపీలు, మంత్రులైతే సుజనాపై ముప్పేట దాడికి దిగారు. సుజనాకి దమ్ముంటే అసలు ఎవరు టచ్ లో ఉన్నారో చెప్పాలంటూ సవాలు విసిరారు. కొందరు ఎంపీలు, మంత్రులైతే వ్యక్తిగత విమర్శలకు దిగారు. సుజనా ఓ బ్యాంకుల దొంగని... గూగుల్ లో బ్యాంకుల దొంగని టైట్ చేస్తే... సుజనా పేరే వస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని సుజనా... బ్యాంకులకు మాత్రం తెలివిగా కన్నాలు వేస్తారని దుయ్యబట్టారు. అరెస్టుల భయంతో బీజేపీ పంచన చేరిన సుజనా... ఇప్పటికీ చంద్రబాబు, టీడీపీ కోసమే పనిచేస్తున్నాడని ఆరోపించారు. సుజనా... చంద్రబాబు ఏజెంటు, కోవర్టని... ఇది బీజేపీ నేతలు ఎప్పుడు తెలుసుకుంటారోనంటూ వ్యాఖ్యానించారు. సుజనాను నమ్ముకుంటే బీజేపీ నాయకులు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అవుతుందని సూచించారు. ఇక, విజయసాయిరెడ్డి అయితే, ఒక వింత డిమాండ్‌ను సుజనాచౌదరి ముందు ఉంచారు. ఈసారి విలేకరులతో కాకుండా బ్యాంకు అధికారులను పిలిచి సుజనా ప్రెస్‌మీట్ పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. బ్యాంకు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే... సుజనా పార్టీ ఎందుకు మారాడో, చంద్రబాబు ఎందుకు మార్చాడో... అన్నీ బయటకు వస్తాయన్నారు. అయితే, మొన్నటివరకు టీడీపీ నేతలతో రహస్య మంతనాలు సాగించిన సుజనా... ఇప్పుడు పార్లమెంటు వేదికగా వైసీపీ ఎంపీలకు గాలమేసే పనిలో పడ్డారని చెప్పుకుంటున్నారు. ఏమైనా సుజనా ప్రకటనతో వైసీపీలో అలజడి అయితే రేగింది. ఎమ్మెల్యేల సంగతి ఎలాగున్నా... నలుగురైదురు ఎంపీలు మాత్రం బీజేపీతో టచ్ లో ఉన్నారని ఎప్పుడ్నుంచో ప్రచారం జరుగుతున్నవేళ... సుజనా వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. లేకపోతే వైసీపీ ఎంపీలంతా అంత హడావిడిగా సుజనాపై మూకుమ్మడిగా కౌంటర్ అటాక్ చేయాల్సినంత అసరమేముందని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా సుజనా కామెంట్స్... వైసీపీలో మాత్రం కలవరం సృష్టిస్తున్నాయి. అంతేకాదు అసలా ఎంపీలు ఎవరన్న చర్చ కూడా నడుస్తోంది.
http://www.teluguone.com/news/content/bjp-mp-sujana-chowdary-comments-on-ys-jagan-39-91508.html