కొవిడ్ ఎండెమిక్ తర్వాత మరో పాండెమిక్!.. బిల్ గేట్స్ వార్నింగ్..
Publish Date:Feb 21, 2022
Advertisement
హమ్మయ్యా.. కరోనా ఖతం అయినట్టే అనిపిస్తోంది. కొవిడ్ భయం పోయింది. జోరుగా వ్యాక్సినేషన్ జరుగుతుండటం.. వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో.. కరోనా అంటే లైట్ తీసుకుంటున్నారు అంతా. ఇక ఆ మహమ్మారి ముగిసినట్టేనని రిలాక్స్ అవుతున్నారు. జనమంతా మామూలుగా గడిపేస్తున్నారు. కావొచ్చు.. కొవిడ్ భయం తగ్గింది కావచ్చు.. కానీ.. అప్పుడే సంబరపడాల్సింది లేదంటున్నారు. వైరస్ మరింత రూపాంతరం చెంది.. కొత్త వేరియంట్‌తో ఇంకో వేవ్ విరుచుకుపడొచ్చని అంటున్నారు. అయితే, ఉన్న కరోనా వైరస్ సరిపోదన్నట్టు.. త్వరలోనే మరో వైరస్ సైతం వెలుగుచూసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అది కరోనా కంటే మరింత డేంజరస్‌గా ఉండే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వార్నింగ్ ఇస్తున్నది మరెవరో కాదు.. ఇటీవల వైరస్‌లు, వ్యాక్సిన్ల విషయంలో ముందున్న బిల్ గేట్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. భవిష్యత్తులో మరో మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడే అవకాశముందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు. అయితే కొత్త మహమ్మారి కరోనా వైరస్ కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యాధికారక వైరస్‌ల నుంచి వచ్చే అవకాశముందని తెలిపారు. ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ జనాభాపై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే ఇటీవల వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే చాలా మందిలో ఇమ్యూనిటీ స్థాయిలు పెరగడంతో ఒమిక్రాన్ వేరియంట్‌ను తట్టుకోగలిగాం. అయితే కొవిడ్ తగ్గుతున్నప్పటికీ.. ప్రపంచంపై మరో మహమ్మారి విరుచుకుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇది బహుశా.. కరోనా కుటుంబం నుంచి గాక, వేరే వైరస్ నుంచి కావొచ్చు. వృద్ధులు, ఒబెసిటీ, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులపై ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు’’ అని బిల్ గేట్స్ హెచ్చరించారు. అయితే వ్యాక్సిన్లతో పాటు కరోనా వైరస్ వల్ల అభివృద్ధి చెందిన యాంటీబాడీల కారణంగా రాబోయే మహమ్మారి నుంచి కూడా బయటపడగలమని గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేగాక, వైద్యరంగంలో అందుబాటులోకి వస్తోన్న అధునాతన సాంకేతికత.. ఈ మహమ్మారులపై పోరాటంలో దోహదపడుతుందని బిల్ గేట్స్ అన్నారు.
http://www.teluguone.com/news/content/bill-gates-warning-on-another-pandemic-39-132089.html





