కేసీఆర్ వెంట ప్రకాశ్‌రాజ్.. అందుకేనా..?`
Publish Date:Feb 21, 2022
Advertisement
నిజమే.. ప్రకాశ్ రాజ్ నిజంగా వర్సటైల్ యాక్టరే. పలు భాషల్లో తనదైన యాక్టింగ్‌తో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కట్టిపడేస్థారనడంలో సందేహమే లేదు. సినిమాలతో మెప్పించినా.. రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోయారు. ఇటీవలి మూవీ ఆర్టిస్ట్ర్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఓటమి చవిచూశారు. అయితేనేం.. ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇస్తుండడం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ పరిశ్రమలో కూడా పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం కేసీఆర్ ఇటీవల పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో ముంబైలో కేసీఆర్ సమావేశం అయిన విషయం తెలిసిందే. అయితే.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో సమావేశం సందర్భంగా మన వర్సటైల్ నటుడు ప్రకాశ్ రాజ్ దర్శనం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేసీఆర్ ముంబై వెళ్లింది జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఏర్పాట్లలో భాగంగా.. మరి ఈ పొలిటికల్ టూర్ లో ప్రకాశ్ రాజ్ అవసరం ఏంటనే ప్రశ్న రాకమానదు. ఉద్ధవ్ థాకరేకు తనతో పాటు తీసుకెళ్లిన నేతల బృందంలో ఒక్కొక్కరినీ కేసీఆర్ పరిచయం చేశారు. ఆ పరిచయ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ గురించి ఉద్ధవ్ కు కాస్త ఎక్కువ ప్రత్యేకంగా కేసీఆర్ పరిచయం చేయడం గమనార్హం. కేసీఆర్ బృందంలోని అందరితో పాటుగా ప్రకాశ్ రాజ్ కూడా ఉద్ధవ్ థాకరే తరఫున బహుమతులు అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా తన వెంట తీసుకెళ్లిన బృందంలో అందరి కంటే ప్రకాశ్ రాజ్ తోనే కేసీఆర్ ప్రత్యేకంగా ఏదో మాట్లాడడం విశేషం. నిజానికి జాతీయ ప్రత్యామ్నాయం అంటూ ఇతర రాష్ట్రాలకు కేసీఆర్ వెళ్లి, ఆయా రాష్ట్రాల ముఖ్యులతో కలిసినప్పుడల్లా ప్రాకాశ్ రాజ్ ను వెంటేసుకు వెళ్తుండడం విశేషం. గతంలో అంటే.. 2018లో జనతాదళ్ ఎస్ సుప్రీమో, మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశానికి వెళ్లినప్పుడు కూడా ప్రకాశ్ రాజ్ను కేసీఆర్ వెంట తీసుకెళ్లారు. అంటే ప్రకాశ్ రాజ్ కర్ణాటక వాడు కాబట్టి దేవెగౌడతో సంప్రదింపులు కాస్త సులువు అవుతాయని తీసుకెళ్లి ఉండొచ్చని అనుకోవచ్చు. అంతకు ముందు 2014లో కేసీఆర్ తెలంగాణ తొలి సీఎం అయిన తర్వాత ప్రకాశ్ రాజ్ తో ప్రత్యేకంగా సమావేశం కావడం విశేషం. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో త్వరలో చెన్నైలో జరగబోయే సమావేశానికి కూడా ప్రకాశ్ రాజ్ ను కేసీఆర్ తీసుకెళ్తారని తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ కు, ఎంకే స్టాలిన్ కు సన్నిహిత సంబంధాలున్నాయంటారు. అందువల్ల ప్రకాశ్ రాజ్ ను తీసుకెళ్లాలనుకోవడంలో సందేహించేదేమీ ఉండకపోవచ్చు. కానీ.. మహారాష్ట్ర సీఎంతో భేటీకి ప్రకాశ్ రాజ్ ను ఎందుకు తీసుకెళ్లారనే ప్రశ్న అందరిలోనూ తొలిచేస్తోంది. ప్రకాశ్ రాజ్, సీఎం కేసీఆర్ ముంబైలో కలుసుకోవడం యాదృచ్ఛికం అని టీఆర్ఎస్ వర్గాలు కవరింగ్ చేసేందుకు యత్నిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కేంద్రంలోని బీజేపీపైన, ప్రధాని మోడీ పైనా కారాలు, మిరియాలు నూరుతూ.. ప్రత్యక్ష పోరాటానికి కాలు దువ్వుతున్న కేసీఆర్ కు ప్రకాశ్ రాజ్ వెంట ఉండడం ఎందుకు అవసరమో అని ఆలోచిస్తే.. ఒకటే గుర్తుకు వస్తుంది. అదే బీజేపీని, మోడీ పరిపాలనను ప్రకాశ్ రాజ్ మొండిగా వ్యతిరేకించడం. నిజానికి రాజకీయాల్లో ప్రకాశ్ రాజ్ సఫలీకృతుడేమీ కాదు.. గత ఎన్నికల్లో బెంగళూరు నుంచి లోక్ సభా స్థానంలో ఇండిపెండెంట్ గా బరిలో దిగి ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే.. పోనీ ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష రేసులో నిలిచి అక్కడా ఓడిపోయారు. అయినప్పటికీ ప్రకాశ్ రాజ్ను కేసీఆర్ వెంటేసుకు తిరగడంలో ఏమి పరమార్థం దాగి ఉందో ఎవరికీ అంతు చిక్కడం లేదు.. రాజకీయ ఎత్తుగడల్లో అపర చాణక్యుడిలా వ్యవహరించే కేసీఆర్ మనసులో ఏముందో?.. ప్రకాశ్ రాజ్ కు ఎందుకు ప్రాధ్యాన్యం కల్పిస్తున్నారో.. ఆయనే స్వయంగా చెబితే తప్ప తెలిసే ఛాన్స్ లేదు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కేసీఆర్ ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయంలో ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ టూర్ షెడ్యూల్ లో ఎక్కడా ప్రకాశ్ రాజ్ ప్రస్తావన లేదు. కానీ.. ముంబైలో కేసీఆర్ బృందం టూర్ ముగిసేంత వరకు ప్రకాశ్ రాజ్ ఆయనను వెన్నంటే ఉండడం విశేషం. ఇదిలా ఉండగా.. ఉద్ధవ్ థాకరేతో భేటీ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ను తీసుకువెళ్లడంపై బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఫైరయ్యారు. దేశ విచ్ఛిన్నకర శక్తులతో కలిసి కేసీఆర్ వెళ్లడం ప్రమాదకరం అని హెచ్చరించారు. ప్రకాశ్ రాజ్ తో కలిసి కేసీఆర్ ముంబై వెళ్లడం వెనుక ఉద్దేశం ఏంటో చెప్పాలని నిలదీయడం విశేషం.
http://www.teluguone.com/news/content/why-actor-prakash-raj-seen-in-kcr-tours-39-132086.html





