ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. కార్మికుడు మృతి..!
Publish Date:Aug 21, 2026
Advertisement
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గార్డెన్‌కు నీరు పోస్తున్న కార్మికుడిని కియా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడిని నవీన్ రాజుగా గుర్తించారు. గార్డెన్ నిర్వహణలో భాగంగా రోడ్డుపక్కన నీరు పోస్తుండగా వేగంగా వచ్చిన కియా కారు ఒక్కసారిగా అదుపు తప్పి అత్యంత వేగంగా వెళ్లి అతడిని ఢీకొట్టినట్లు తోటి కార్మికులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు నవీన్ రాజు తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన కారు, డ్రైవర్‌కు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరగడంతో ఆగ్రహానికి గురైన తోటి కార్మికులు పెద్ద సంఖ్యలో ఔటర్ రింగ్ రోడ్డుపైకి చేరుకున్నారు. కార్మికుడి మృతికి కారణమైన కారు డ్రైవర్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమ కాంట్రాక్టర్ వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు పట్టుబట్టారు. కాంట్రాక్టర్ అక్కడికి రాకపోతే ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్మికులు భారీగా రోడ్డుపైకి చేరడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Accident on the Outer Ring Road, Shamshabad, Pedda Golconda, Naveen Raju, Crime news, CP Sajjanar, DGP C.V. Anand
http://www.teluguone.com/news/content/accident-on-the-outer-ring-road-36-229457.html





