బుగ్గన మెడకూ బియ్యం ఉచ్చు!?

ఒక వైపు పేర్ని నాని కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. ఆయన భార్య పేర్ని జయసుధ పేరిట ఉన్న గోదాం నుంచి భారీగా రేషన్ బియ్యం మాయం అయినట్లు తేలడంతో ఆయన ఇక తప్పించుకునే మార్గం లేదని ఖరారు చేసుకునే కుటుంబంతో సహా పరారైనట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయస్థానాలలో కూడా పేర్ని నాని కుటుంబానికి ఊరట లభించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు. మాయం అయిన బియ్యం విలువకు సమానంగా సొమ్ములు చెల్లిస్తామంటూ ఆయన న్యాయవాదులు చెప్పడంతోనే పేర్ని కుటుంబం బియ్యం మాయం చేసినట్లు అంగీకరించినట్లైందని అంటున్నారు.  అయితే ఇలా గోదాముల నుంచి బియ్యం మాయం ఒక్క పేర్ని కుటుంబానికి మాత్రమే పరిమితం కాలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోదాములు ఉన్న వైసీపీ నేతలు మరింత మంది కూడా రేషన్ బియ్యం అక్రమంగా తరలించేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బేతంచర్లలో ఉన్న గోదాం నుంచి కూడా పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ఆరోపణలు రాగానే బుగ్గన స్పందించారు. ఆ గోడౌన్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే..ఆ గోడౌన్లలో కొన్ని తన బంధువులకు చెందినవి అయి ఉండొచ్చంటూ ముక్తాయించడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. తన బంధువుల గోదాంల నుంచి రేషన్ బియ్యం మాయమైతే తనకేం సంబంధం అంటూ బుగ్గన చేసిన వ్యాఖ్యలతోనే బేతంచర్లలోని గోదాంలలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని అంగీకరించినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఎంతగా దబాయించాలని చూసినా.. బేతంచర్ల గోదాంల నుంచి రేషన్ బియ్యం మాయం అయ్యాయనీ, అది తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంలో  బుగ్గన ఉన్నారనీ ఆయన మాటలను బట్టే అవగతమౌతోంది. బుగ్గన బంధువుల పేరు మీద గోడౌన్లు నడిచినా ఆయన సహకారం, మద్దతు లేకుండా బియ్యం మాయం చేయడం సాధ్యం కాదని పరిశీలకులు చెబుతున్నారు.   బేతంచర్ల గోదాముల వ్యవహారంలో  విజిలెన్స్ దర్యాప్తు ఆరంభమైంది. మాయమైన బియ్యం లెక్కలు నేడో రేపో  బయటకు రాకపోవు. ఈ భయంతోనే బుగ్గన మీడియా ముందుకు వచ్చి మరీ ఆ గోదాములతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకుంటున్నారని అంటున్నారు.  అలాగే వైసీపీకి అలవాటైన ఎదురుదాడికీ పాల్పడుతున్నారు.  అదే సమయంలో బియ్యం మాయంతో తనకేం సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. పరిస్థితి చూస్తుంటే బుగ్గనకూ అజ్ణాత వాసంలోకి వెళ్లక తప్పని పరిస్థితి త్వరలోనే ఎదురు కావచ్చునంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  
Publish Date: Dec 28, 2024 9:48AM

ఏసీబీ కంటే ముందు ఈడీ – కేటీఆర్‌కు నోటీసులు !

ఫార్ములా ఈ రేసు కేసులో  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది.  ఒక వైపు ఈ కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడమే కాకుండా దర్యాప్తు కూడా ప్రారంభించింది. దీనిపై కోర్టుకు వెళ్లిన కేటీఆర్ స్వల్ప ఊరటను పొందారు. అసలింకా ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు కూడా జారీ చేయలేదు. కానీ ఈ లోగానే  ఏసీబీ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  ఫార్ములా ఈ రేసు విషయంలో డబ్బులు విదేశాలకు తరలించిన వ్యవహారంలో ఈడీ పకడ్బందీగా అడుగులు వేస్తోంది.  ఈ కేసులో విచారణకు రావాలంటూ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీయే మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అయితే వీరిరువురినీ కేటీఆర్ కంటే ముందుగానే అంటే జనవరి 2, 3 తేదీలలో విచారించనుంది.  ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ప్రివెంటివ్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం కింద విచారణ జరుపుతున్న ఈడీ ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించింది.  ఎఫ్ఈవోకు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.  ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు అవినీతికి సంబంధించింది. అయితే ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో అవినీతి జరగలేదని కేటీఆర్ గట్టిగా చెబుతున్నారు. అయితే ఈడీ మాత్రం ప్రభుత్వ సొమ్మును అక్రమంగా తరలించారంటూ కేసు పెట్టింది. ఏదో రూపంలో సొమ్ములు తరలించినట్లు కేటీఆర్ కూడా అంగీకరిస్తున్నారు. అదే సమయంలో ఆ తరలింపుతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే ఈడీ రంగంలోకి దిగింది. అక్రమంగా సొమ్ములు తరలింపులో కేటీఆర్ ప్రమేయం ఉందా లేదా అన్నది ఈడీ తేలుస్తానంటూ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కన్నా ఈడీ దూకుడుగా వ్యవహరించడం కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు ఆందోళన కలిగించే అంశమే.  అసలు ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ న్యాయ సలహా తీసుకున్న తరువాత అనుమతి ఇవ్వడంతోనే ఏదో తప్పు జరిగిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేయడంతో కేటీఆర్ కు ఉచ్చు బిగిసిందన్న భావన రాజకీయ వర్గాలలో కూడా వ్యక్తం అవుతోంది. 
Publish Date: Dec 28, 2024 9:22AM

మానిప్యులేటివ్ గా ఉంటే నష్టాలు తప్పవు..!

  ప్రపంచంలో మనిషి ఎప్పుడూ ఎదుటివారి మీద అజమాయిషీ చెలాయించాలని చూస్తుంటాడు.  అది తన కంటే తక్కువ వర్గానికి చెందిన జాతుల మీద అయినా,  వేరే వర్గానికి చెందిన జంతువుల  మీద అయినా..  తన కింద కొందరు ఆటబొమ్మలుగా ఉంటే తృప్తి పడుతూ ఉంటారు. కొందరు వ్యక్తులు చాలా తెలివిగా ఉంటారు.  వారి మాటలతో ఇతరుల్ని చాలా ఈజీగా నమ్మిస్తారు.  సులభంగా వారి మీద  తమ మాటలతో  ఆధిపత్యం తెచ్చుకుంటారు.  ఇతరులను నియంత్రిస్తారు.  ఇలాంటి వారిని మానిప్యులేటివ్ వ్యక్తులని చెబుతారు. ఇలా మానిప్యులేటివ్ వ్యక్తులుగా ఉండటం వల్ల తాము చాలా గొప్పవారిమని, తెలివైన వారిమని అనుకుంటారు. ఇతరులు ఎప్పుడూ తమ చెప్పుచేతలలో ఉంటారనే ఆలోచనతో కూడా ఉంటారు. కానీ మానిప్యులేటివ్ వ్యక్తులుగా ఉండటం ఇతరులకే కాదు.. మానిప్యులేటివ్ వ్యక్తులకు కూడా మంచిది కాదని చెబుతున్నారు. మానిప్యులేటివ్ గా ఉండే వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ ను కూడా నాశనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.  మానిప్యులేటివ్ వ్యక్తుల ప్రవర్తన వారి వ్యక్తిగత రిలేషన్స్ విచ్చిన్నం కావడానికి దారి తీస్తుందట.  వారి ప్రవర్తన వ్యక్తిగత బంధాలలో విభేదాలు సృష్టిస్తుంది.  ఇది వ్యక్తులకు బంధం మీద,  పరిస్థితుల మీద నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మానిప్యులేటివ్ వ్యక్తులు తమ మాటలతో ఇతరులను ఎలా ఆకట్టుకుంటారో.. ఇతరులను ఎలా బోల్తా కొట్టిస్తారో..ఇతరులు తనతో అలాగే ఉంటారేమో అనే భ్రమలో ఉంటారు.  ఈ కారణంగా వ్యక్తిగత జీవితంలో భాగస్వామి, స్నేహితులు,  కుటుంబ సభ్యుల మాటలను కూడా అంత తేలికగా నమ్మరు.  వారిని విశ్వసించరు. ఈ కారణం వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య అపనమ్మకం చాలా ఎక్కువగా తొంగిచూస్తుంది. మానిప్యులేటర్ వ్యక్తులు ఇతరులకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు.  ఎందుకంటే ఇలాంటి వ్యక్తులతో ఉండటానికి, వారితో మాట్లాడటానికి ప్రజలు ఇష్టపడరు.  మానిప్యులేటివ్ వ్యక్తులు ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ విషయాలను వ్యాప్తి చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే మానిప్యులేటివ్ వ్యక్తులు తమ సొంత ఇష్టాలను,  వారి సొంత అవసరాలను కూడా వారే అర్థం చేసుకోలేరు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో గందరగోళంగా ఉంటారు.  ఎందుకంటే వారి దృష్టి ఎప్పుడూ ఎక్కువగా ఇతరులపైనే ఉంటుంది.  సింపుల్ గా చెప్పాలంటే మానిప్యులేటర్లు ఎక్కువగా ఇతరుల జీవితాలను చూస్తూ.. ఇతరుల జీవితాలను తమ చెప్పుచేతలలో ఉంచుకోవడంలోనే కాలం గడిపేస్తుంటారు. మానిప్యులేటివ్ వ్యక్తుల ప్రవర్తన ఆఫీసులలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రవర్తన కారణంగా సహోద్యోగుల నుండి,  పై అధికారుల నుండి   చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందరి నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇతరులను తమ చెప్పుచేతలలో పెట్టుకోవాలనే ఆలోచనల కారణంగా ఒత్తిడి, ఆందోళన ఏర్పడతాయి.  వీటి కారణంగా మానసిక,  శారీరక ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. క్రమంగా ఒకరిని నియంత్రించాలని ప్రయత్నించడమనే అలవాటు.. ఆ నియంత్రించే వ్యక్తుల మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి కారణం అవుతుంది.                                              *రూపశ్రీ.  
Publish Date: Dec 28, 2024 9:18AM

కడపలో వైసీపీ పట్టు జారిపోయింది!?

కడప జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కడపలో మాత్రం జగన్ మాటే నెగ్గుతుంది. జగన్ పేరు  చెప్పుకుని చెలరేగే వైసీపీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాట. 2014లో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడూ అలాగే సాగింది. ఆ తరువాత వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ కడపలో వైసీపీయుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. ఆ తరువాత అంటే తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కూడా ఇటీవలి కాలం వరకూ వైసీపీ హవాయే నడిచింది.  అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కడపలో వైసీపీ అరాచకాలకు కళ్లెం వేడాయినిక కృత నిశ్చయంతో ఉంది. ఎవరైనా సరే చట్టాలను, నిబంధనలను గౌరవించాల్సిందే అని కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది. తోక జాడిస్తే ఆ తోకను కట్ చేయడానికి రెడీ అని హెచ్చరికలు జారీ చేస్తోంది. కడప గడ్డపై నుంచే వైసీపీ నేతల అరాచకాలకు చెక్ పెడతామనీ, మెడలు వంచుతామని హెచ్చరికలు జారీ చేయడానికి రెడీ అవుతోంది. గాలీవీడు ఎంపీడీవోపై దాడి చేసిన వైసీపీ నేతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం ద్వారా ఆ పార్టీకి, పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికి సమాయత్తమౌతోంది.  ఇందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నడుంబిగించారు. ఉమ్మడి కడప జిల్లాలో ఇక చట్టాన్ని అతిక్రమించే వారికి చుక్కలు చూపిస్తామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడానికి ఆయన కడప పర్యటనకు సమాయత్తమౌతున్నారు.   ఇంత కాలం ఉమ్మడి కడప జిల్లాలను వైసీపీ నేతలు తమ అడ్డాగా మార్చుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వ అధికారులను భయపెట్టి తమ దారికి తెచ్చుకునేవారు. వారు దారికి రాకుంటే ఫ్యాక్షనిస్టు మార్గాలలో కుటుంబాలను టార్గెట్ చేసుకుని బెదరింపులకు పాల్పడేవారు. దీంతో అధికారులు కూడా ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా సేఫ్ గేమ్ ఆడేవారు. దీంతో ఇంత కాలం కడపలో వైసీపీ రాజ్యాంగమే నడుస్తూ వచ్చింది. వైసీపీ రాజ్యాంగమంటే రాజారెడ్డి రాజ్యాంగమని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇకపై ఇలాంటి పోకడలు సహించేది లేదన్న సంకేతాన్ని కూటమి ప్రభుత్వం గాలివీడు ఎంపీడీవోపై దాడి సంఘటన తరువాత  ఆ దాడికి పాల్పడిన వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడ్ని చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కుని పోవడం  ద్వారా కూటమి సర్కార్ ఇచ్చింది. పోలీసులకు, అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఇక వైసీపీయుల అరాచకాలకు కళ్లెం వేస్తామని స్పష్టం చేసింది. అధికారులు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, నిర్భయంగా తమ పని తాము చేస్తే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చాటడం ద్వారా కూటమి సర్కార్ వైసీపీయుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇక ప్రభుత్వాధికారులకు నైతిక భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఆయన కడప జిల్లాలో పర్యటించి అధికారులు, ప్రజలలలో ధైర్యాన్ని నింపడానికి సమాయత్తమౌతున్నారు. ఇప్పటకే జిల్లా జనం, వైసీపీ క్యాడర్ జగన్ తీరు పట్ల ఒకింత అసహనంతో ఉన్నారు. ఆ విషయం ఇటీవల క  జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో ప్రస్ఫుటంగా కనిపించింది. సొంత పార్టీ క్యాడరే అధినేత జగన్ పట్ల అసంతృప్తి, అసహనాన్ని బాహాటంగా ప్రదర్శించారు. జగన్ వ్యవహార శైలి పట్ల తమ వ్యతిరేకతను సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా కడప గడ్డపై నుంచి వైసీపీ అరాచకాలను సహించేది లేదని చాటేందుకు రెడీ అవడంతో  ఇక వైసీపీయులకు దిమ్మతిరిగి బొమ్మ కనపడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 
Publish Date: Dec 28, 2024 9:03AM

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతి.. టీటీడీ నిర్ణయం

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు సార్లు వారి లేఖలకు అనుమతి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెజారిటీ సభ్యులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమించాలనడంతో టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.   శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. . తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడాన్ని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌,  అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఖండించారు. తిరుమల శ్రీవారి దర్శనంలో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందని  మంత్రి కొండా సురేఖ కూడా గళమెత్తారు.   దీంతో ఈ విషయాన్ని పున: పరిశీలించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. బోర్డులోని మెజారిటీ సభ్యుల అభిమతం మేరకు వారానికి రెండు సార్లు తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇహనో ఇప్పుడో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  
Publish Date: Dec 28, 2024 8:35AM