ఢిల్లీ ఎన్నికలు.. బీజేపీ నెత్తిన పాలు పోస్తున్న కాంగ్రెస్, ఆప్ విభేదాలు!
Publish Date:Jan 15, 2025
Advertisement
ఢిల్లీలో అధికారం కోసం బీజేపీ గత మూడు పర్యాయాలుగా చెమటోడుస్తూనే ఉంది. అయినా హస్తిన ప్రజ కమలనాథులకు ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో కష్టం లేకుండానే హస్తినపై కమలనాథుల జెండా ఎగిరే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు బీజేపీ ప్రయోజకత్వం కానీ, ఆ పార్టీపై ప్రజలలో నమ్మకం పెరగడం కానీ కారణం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి ఏమిటి కారణం? అన్న ప్రశ్నకు కాంగ్రెస్, ఆప్ మధ్య విభేదాలే కారణమన్న సమాధానం వస్తోంది. అసలు దేశంలో వరుసగా మూడు పర్యాయాలు బీజేపీ అధికార పగ్గాలను అందుకోవడానికి కారణం బీజేపీయేతర పార్టీల అనైక్యతేనన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలోనూ అదే జరగనుందని అంటున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం కూడా జోరందుకుంది. పోటీ ప్రధానంగా అధికార ఆప్, విపక్ష బీజేపీల మధ్యే అన్నట్లుగా పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం దగ్గర నుంచీ అన్నిటా వెనుకబడే ఉంది. బీజేపీ, ఆప్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఢిల్లీ మార్మోగిపోతున్నది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ జుగల్ బందీ నాటకం బయటపెడతానని చేసిన వ్యాఖ్యలతో బీజేపీ నెత్తిన పాలు పోసినట్లైంది. కాగా కేజ్రీవాల్ వ్యాఖ్యలై కాంగ్రెస్ మండి పడింది. రాహుల్ గాంధీ కూడా కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు.
ఇక్కడ చెప్పుకోవాల్సిందేమిటంటే.. కాంగ్రెస్, ఆప్ లు పరస్పర విమర్శలపై పెట్టిన దృష్టి కమలంపై పెట్టడం లేదు. ఈ రెండు పార్టీలూ కమలం పార్టీని వదిలేసి పరస్పర నిందలతో సరిపెడుతున్నాయి. దీంతో ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ పని నల్లేరుమీద బండి నడకలా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా వెండిపల్లెంలో పెట్టి బీజేపీకి ఢిల్లీని అప్పగించడంలో పోటీ పడుతున్నాయన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/delhi-assembly-elections-bjp-safe-game-39-191281.html