తంబళ్లపల్లి ప్రవీణ్ రెడ్డి రాజకీయ చరిత్ర
Publish Date:Sep 28, 2012
Advertisement
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచం అంచులవరకూ చాటేందుకు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన ఆశయానికి ఆకర్షితులై ఎంతోమంది రాజకీయరంగంలోకి దూకారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి తండ్రి ఉమాశంకర్ రెడ్డికూడా అలా తెలుగుదేశం పార్టీలోకి దూకిన రాజకీయ యోధుడే. ఎన్టీఆర్ ఆయనకు 83 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టిచ్చారు. ఉమాశంకర్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పట్టువీడని ఎన్టీఆర్.. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇప్పించి ప్రోత్సహించారు. ఆయన చనిపోయినప్పుడు ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి ఉమాశంకర్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. బాధ్యత కలిగిన పార్టీ అధ్యక్షుడిగానే కాక, మంచిమనసున్న మనిషిగా పాడెకూడా మోశారు. ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలబడ్డారు. ఉమాశంకర్ భార్యకి మూడుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్టిచ్చి రెండుసార్లు పార్టీయే పట్టుబట్టి గెలిపించుకుంది. ఉమాశంకర్ రెడ్డి కొడుకు ప్రవీవ్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీయే చదివించింది. 2009లో ఆయనకు పార్టీ టిక్కెట్టిచ్చి గెలిపించుకుంది. ఆ కృతజ్ఞతను మర్చిపోయి ఇప్పుడు ప్రవీణ్ చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ఎమ్మెల్యే అమర్ నాథరెడ్డి చరిత్రకూడా ఇలాంటిదేనని గుర్తుచేస్తున్నారు. అమర్ నాథరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి కుప్పంలో అత్యధిక మెజార్టీతో మూడుసార్లు ఎంపీగా, మరో మూడుసార్లు ఎమ్మెల్యేగాగెలిచారని, 1999లో అమర్ నాథరెడ్డి ఓటమి పాలైనప్పుడు అండగా నిలిచిన పార్టీ.. తనని ప్రోత్సహించేందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షపదవిని కట్టబెట్టిన విషయాన్ని మరోసారి ఆయన గుర్తు చేసుకోవాలని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/-tamballapally-praveen-reddy-24-17747.html





